'రెవెన్యూ లోటు భర్తీకి రూ.11,700 కోట్లు ఇవ్వండి'
కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ కింద 11,700 కోట్ల రూపాయలను తక్షణం ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. గత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ కింద అడ్ హాక్గా 2,300 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది.
మిగతా రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి అకౌంటెంట్ జనరల్ ఆడిట్ లెక్కలు వచ్చిన తరువాత ఇస్తామని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో అకౌంటెంట్ జనరల్ ప్రొవిజనల్గా గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.14,000 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీని ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగతా 11,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారు.