పాస్‌పుస్తకాల సీడింగ్‌లో వెనుకబడ్డాం
కలెక్టర్ యువరాజ్
విశాఖ రూరల్: పట్టాదార్ పాస్‌పుస్తకాల ఆధార్ సీడింగ్‌లో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపుతూ వారి పరిధిలోని భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో, తహశీల్దార్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,75,076 పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయని, వీటిలో 2,80,865 పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో 1,67,261 మంది పట్టాదారుల వివరాలు నోషనల్ ఖాతాలో ఉండగా, వాటిలో కేవలం 3,638 మంది పట్టాదార్ల వివరాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయన్నారు.
వెబ్‌ల్యాండ్‌లో ఇప్పటి వరకు కేవలం 59 శాతం పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేస్తూ నమోదు చేయడం జరిగిందని వివరించారు. ఈ సీడింగ్ కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానం కాని భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలు భవిష్యత్తులో నిలుపుదల చేస్తారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ 95 శాతం పూర్తయినందున,ఆ డేటాను సేకరించి పట్టాదార్ల సీడింగ్‌కు వినియోగించాలని చెప్పారు. ఈసమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏజేసీ వై.నరసింహారావు, ఎస్డీసీలు భవానిదాస్, వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు వెంకటమురళి, వసంతరాయుడు, సూర్యారావు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ రత్నం పాల్గొన్నారు.