పట్టాలిచ్చింది పొమ్మనడానికేనా?
రామచంద్రపురం :‘మీరు ఇల్లు కట్టుకోలేదు గనుక.. గతంలో ఇచ్చిన ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం’ అంటూ రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు రామచంద్రపురం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పేదలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇచ్చిన జాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఎక్కడా లేనట్టు వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు.
రామచంద్రపురం మండలంలోని ఆదివారపుపేటలో 13, నరసాపురపుపేటలో 10 ఎకరాలను 2007లో ప్రభుత్వం సేకరించింది. స్థలాల మెరక నిమిత్తం అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఆదివారపుపేట భూమికి రూ.3 కోట్లు, నరసాపురపుపేట భూమికి రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. ఆదివారపుపేటలో సేకరించిన స్థలాన్ని మెరకపనులు పూర్తిచేసి 525 లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. నరసాపురపుపేటలో అసంపూర్తి మెరక పనులతోనే 170 మందికి పట్టాలందజేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ఆ స్థలాల్లో గృహనిర్మాణానికి పూనుకోకపోగా తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించలేదు. గృహనిర్మాణ శాఖ ద్వారా రుణాలు సైతం మంజూరు చేయలేదు.
దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు వీలులేకపోయింది. ఇప్పుడు ‘మీరు ఇల్లు కోలేదు. మీ అందరి ఇంటి పట్టాలు రద్దు చేసి, స్థలాలు స్వాధీనం చేసుకుంటాం’ అంటూ తహశీల్దార్ నోటీసులు ఇవ్వడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రుణాలు మంజూరు చేయకుండా ఇళ్లు ఎలా నిర్మించుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్లు పోరాడి సాధించుకున్న స్థలాలను లాక్కొనే ప్రయత్నమేమిటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులపై ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ స్థలాల్లో ప్రభుత్వం వివిధ కళాశాలలను నిర్మిస్తుందని తహశీల్దార్ చెబుతున్నారని లబ్ధిదారులు అంటున్నారు. నిరుపేదలకు అందించిన స్థలాల్లో కళాశాలలు నిర్మించటమేమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకే ఇలా జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టాల రద్దును నిలిపివేసి, రుణాలు మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం చేపడతామంటున్నారు. దీనిపై కలెక్టర్‌ను ఆశ్రయిస్తామంటున్నారు.
పాత పట్టాలు రద్దు చేసి.. తమ వారికి కట్టబెట్టాలని..
కాగా రామచంద్రపురం అర్బన్ పరిధిలోని కొత్తూరులో గతంలో 42 ఎకరాలు సేకరించి, జీ ప్లస్ తరహాలో గృహ సముదాయం నిర్మించి ఇచ్చేందుకు పట్టణంలో పేద, మధ్య తరగతులకు చెందిన 2800 మందిని ఎంపిక చేసి పట్టాలు ఇచ్చారు. స్థలం మెరక పనులకు సుమారు రూ.3 కోట్లు కేటాయించారు. కాగా ప్రభుత్వాలు మారాక ఈ స్థలాన్ని పట్టించుకునే వారే లేరు. ఇప్పుడు.. గతంలో ఇచ్చిన పట్టాల్ని రద్దు చేసి, కొత్తగా అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ వినిపిస్తోంది. ఈమేరకు అధికార పార్టీకి చెందిన కొందరు తమ పార్టీ కార్యకర్తల నుంచి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో పాటు కొంత సొమ్మును కూడా వసూలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఇదే స్థలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నించి నిబంధనలు అడ్డు రావటంతో వెనుకంజ వేశారు. ఇప్పుడు పాత పట్టాలను రద్దు చేయడానికి అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులను వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఇళ్లు కట్టుకోనందునే నోటీసులిచ్చాం..
ఆదివారపుపేట, నరసాపురపుపేటల్లో గతంలో పట్టాలు పొందిన వారికి నోటీసులు ఇవ్వడంపై రామచంద్రపురం తహశీల్దార్ టీఎల్ రాజేశ్వరరావును వివరణ కోరగా లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోనందునే పట్టాల రద్దుకు నోటీసులిచ్చామన్నారు. గృహనిర్మాణ శాఖ రుణాలు మంజూరు ఎందుకు చేయలేదనే విషయాన్ని ఆ శాఖ అధికారులతో చర్చించి అనంతరం పట్టాల రద్దుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు.