రివర్స్ బ్రెయిడెడ్ బన్..
సిగ సింగారం
ఈ హెయిర్ స్టయిల్‌ను సమ్మర్ స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్‌కో లేక ఆఫీసుకో వెళ్లినప్పుడు రకరకాల హెయిర్ స్టయిల్స్‌ను వేసుకుంటాం. కానీ ఇంటికి రాగానే ఆ జుత్తునంతా పైకి లాగి, రబ్బర్బ్యాండుతోనో క్లిప్తోనో పైకి పెట్టేసుకుంటాం. అవునా.. కానీ ఈ రివర్స్ బ్రెయిడెడ్ బన్ను వేసుకుంటే అలా రెండు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా? దానికి సమాధానం మీకు పక్కనున్న ఫొటోను చూడగానే అర్థం అవుతుంది. మరి ఆలస్యమెందుకు.. వెంటనే ఈ రివర్స్ బ్రెయిడెడ్ బన్ను ట్రై చేయండి.
1. జుత్తునంతా ఫొటోలో కనిపిస్తున్న విధంగా ముందుకు వేసుకొని, చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. అలా దువ్వుకునేటప్పుడు ఆ దువ్వెనను నీళ్లలో ముంచుకుంటూ చిక్కులు తీసుకుంటే జుత్తు సాఫ్ట్‌గా అవుతుంది.
2. ఆపైన జుత్తును మూడు పాయలుగా తీసుకొని జడలా కొద్దివరకు అల్లాలి. తర్వాత రెండు పక్కల నుంచి రెండు పాయలను తీసి ఈ జడలో కలుపుకోవాలి. ఆపైన మళ్లీ రెండు పాయలను తీసి అల్లుకుపోవాలి. (అల్లుకునేటప్పుడు మధ్యమధ్యలో హెయిర్‌స్ప్రేతో స్ప్రే చేసుకోవడం మంచిది. అలా చేస్తే అల్లుతున్నప్పుడు పొట్టి వెంట్రుకలు పాయల నుంచి విడిపోకుండా ఉంటాయి)
3. అలా రెండు పక్కల నుంచి రెండు పాయల్ని తీసి కలుపుకుంటూ నడినెత్తి మీద కాకుండా కొంచెం కింద వరకు అల్లి ఆపేయాలి. తర్వాత మిగిలిన జుత్తుకు రబ్బర్‌బ్యాండ్ పెట్టేయాలి.
4. ఆ మిగిలిన పోనీని అందంగా మెలిక తిప్పుకుంటూ లేదా గుండ్రంగా చుడుతూ కొప్పు పెట్టుకోవాలి. ఆ కొప్పును ఆ బ్యాండ్‌తోనే టై చేసుకోవాలి. లేదూ అనుకుంటే.. వేరే రబ్బర్బ్యాండునూ ఆ కొప్పుకు పెట్టుకోవచ్చు. (ఇప్పుడు ఆ కొప్పు బన్ ఆకారంలోకి వచ్చేలా చూసుకోవాలి)
5. ఇప్పుడు అల్లుకున్న జడ మరీ టైట్‌గా లేకుండా పాయల్ని కొద్దికొద్దిగా కదిలిస్తూ వదులు చేసుకోవాలి. మరీ వదులుగా చేసుకున్నా లుక్ పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఒక్కోపాయను కదిలించాలి. అంతేకాదు కొప్పు కూడా గుండ్రంగా, కొంచెం వదులుగా ఉంటేనే ఈ హెయిర్ స్టయిల్ అందంగా ఉంటుంది.
6. తర్వాత ఫొటోలో కనిపిస్తున్నట్టుగా ఫ్లవర్ బీడ్స్‌ను పాయలకు పెట్టాలి. అంతేకాదు కొంచెం పెద్ద సైజులో ఉన్న పూల గుత్తిని మీ జుత్తుకు పెట్టుకోవాలి. దాంతో మీ కొప్పు అందమే మారిపోతుంది. కావాలంటే మీ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే కలర్ బీడ్స్, పూలగుత్తిని పెట్టుకోవచ్చు.
....
చెప్పడం కాదు కానీ.. ఓసారి ఫొటోపై లుక్కేయండి చాలు. ఈ రివర్స్ బ్రెయిడెడ్ బన్‌కు మీరు ఫ్యాన్ అవ్వక తప్పదు. ఈ బీడ్స్ లాంటివి షాపుల్లో విరివిగా దొరుకుతున్నాయి. ఇక కేశాలంకరణలో నో కాంప్రమైజ్... బీడ్స్ తో అలంకరించుకోవాలి. అలా చేస్తే మీ హెయిర్ స్టయిల్ చాలా అందంగా ఉంటుంది.