చర్చల్లోనే రుణాల రీషెడ్యూల్
రెండు రాష్ట్ర ప్రభుత్వాలను
పూర్తి వివరాలతో రమ్మని కోరాం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాల రీ-షెడ్యూల్ గురించి చర్చలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రమ్మనమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్పష్టం చేశారు. కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎస్ఎల్బీసీ అనుమతితో రుణాల రీ-షెడ్యూల్ ఎలా చేయాలో ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయన్నారు.
ఈ నిబంధనలు కాకుండా ప్రత్యేకంగా రీ-షెడ్యూల్ కావాలంటే పూర్తి వివరాలతో రమ్మనమని కోరినట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఫిక్కీ నిర్వహించిన ‘ఫిన్సెక్-2014’ సదస్సులో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న గాంధీ తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ రీ-షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంతవరకు అందలేదని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
రుణ మాఫీ లేదా రీ-షెడ్యూల్ ఆలస్యంతో ఏర్పడుతున్న ఎన్పీఏలకు సంబంధించి బ్యాంకులకు ప్రత్యేకంగా ఏమైనా మినహాయింపులు ఇస్తారా అన్న ప్రశ్నకు వ్యవసాయ రుణాల ఎన్పీఏలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారమే బ్యాంకులు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు రెండు రోజుల ఫైనాన్షియల్ సెక్టార్ కాన్క్లేవ్ ‘ఫిన్సెక్-2014’ ప్రారంభించిన తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతు రుణ మాఫీపై జూలై 16న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ఏటీఎంలు
గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా చిన్న నోట్లను అందించే ఏటీఎంలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు రూ.500, రూ.1,000 నోట్లను అందిస్తున్నాయని, కాని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పెద్ద నోట్ల కంటే చిన్న నోట్లకు డిమాండ్ ఉండటంతో ప్రత్యేక ఏటీఎంలను రూపొందిస్తున్నట్లు గాంధీ తెలిపారు. చిన్న నోట్లను అందించే ఏటీఎంలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు.
చెల్లింపులకు ప్రత్యేక బ్యాంకులు
కేవలం చెల్లింపుల కోసం ఏర్పాటు చేయనున్న పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగా డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ఏర్పాటులో భాగంగా ముందుగా పేమెంట్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు గాంధీ తెలిపారు. పేమెంటు బ్యాంకులు ఇతర వాణిజ్య బ్యాంకుల్లా డిపాజిట్ల సమీకరణ, రుణ వితరణ తదితర కార్యకలాపాలు నిర్వహించవు.
ఇవి కేవలం కార్పొరేట్, ప్రభుత్వాలు చేసే వివిధ రకాల చెల్లింపులను మాత్రమే స్వీకరిస్తాయి. దేశంలో సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఆర్థిక సేవల రంగంలో దక్షిణాది రాష్ట్రాలు దేశ సగటు కంటే ముందున్నాయన్నారు. మార్చి 2012 నాటికి దేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా 42.8 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో వస్తే ఈ సగటు దక్షిణాది రాష్ట్రాల్లో 66 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆగిపోయిన మైక్రోఫైనాన్స్ వ్యాపారం తిరిగి ప్రారంభం కావడానికి మరికొంత కాలం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి కో-చైర్ జేఏ చౌదరితోపాటు బ్యాంకింగ్, బీమా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.