Rhetorical
-
జెలెన్ స్కీతో ఫోన్లో సంభాషించిన మోదీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. అదీకూడా పుతిన్ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరిస్తానని బహిరంగా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు నాయకులు ఫోన్లో సంభాషించుకోవడం విశేషం. పైగా పుతిన్ తమ దాడిని ముఖ్యంగా నాటో సభ్య దేశాలైన యూఎస్ దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న గొప్ప యుద్ధంగా అభివర్ణించుకున్నాడు కూడా. ఈ మేరకు ఫోన్లో మోదీ....ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతాల రష్యా బలగాల దాడి గురించి ప్రస్తావిస్తూ...అణుదాడుల విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఇరు దేశాల నాయకులు శత్రుత్వాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పునరుద్ఘాటించారు. వివాదానికి ఎప్పుడూ సైనిక పరిష్కారం ఉండదని కూడా దృఢంగా చెప్పారు. అలాగే ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: బంగ్లాదేశ్‌లో సగం పైగా జనాభా అంధకారంలోనే...) -
Punch Dialogues: రోశయ్య చెణుకు విసిరితే..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రోశయ్య వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా పేరు గడించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు. తన సహజశైలితో, ఎలాంటి మొహమాటం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రస్తావన వచ్చిదంటే చాలు.. రోశయ్య మాటలు తూటాల్లా పేలేవి. చదవండి: నింగికేగిన నిగర్వి ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను రోశయ్య కించపర్చారంటూ నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేశారు. రోశయ్యకు కోపం ఎక్కువైందని, ఎన్టీఆర్‌ను కించపర్చారని తప్పుపట్టారు. దానిపై స్పందించిన రోశయ్య.. ‘‘నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. అసెంబ్లీలో పరిస్థితి, టీడీపీ వాళ్ల తీరు చూసి ఈ సభకు ఏం ఖర్మ పట్టిందన్న ఆవేదనతో కోపం వచ్చింది. అయినా ఎన్టీఆర్‌ను చంద్రబాబు, టీడీపీ ఎంతగా గౌరవించారో అందరికీ తెలుసు’’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..? 2004–09 మధ్య రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు ఏదో విషయంలో పోలీసులకు దొరికిపోయాడంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న రోశయ్య నెమ్మదిగా లేచి..‘‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు నాకు, ఎన్టీ రామారావుకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని చురక వేశారు. ఆ దెబ్బకు తెలుగుదేశం శిబిరం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆయన వైఎస్ కాదు.. ఓ యస్ వైఎస్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రోశయ్య దగ్గరికి వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారని వారు రోశయ్యకు చెప్పగా.. ‘‘ఆయన ఇస్తారండి.. ఆయన వైఎస్ కాదు.. ఓయస్.. ఎవరైనా ఏదైనా కావాలని వెళితే ఆయన కాదనరు. ఆయన ఇచ్చే హామీలను అమలు చేసేందుకు నా తలప్రాణం తోకకు వస్తోంది..’’ అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. వెన్నుపోటు పొడిచేవాడ్ని మరి.. మరోసారి రోశయ్య తెలివితేటలు సరిగా లేవంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. దానిపై రోశయ్య స్పందిస్తూ.. ‘‘నాకు తెలివితేటలుంటే ఇలా ఉంటానా? నన్ను నమ్మిన రాజశేఖరరెడ్డిని ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని, విజయభాస్కర్‌రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచేవాడిని..’’ అంటూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనను గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు అవాక్కై కిమ్మనకుండా కూర్చుండిపోయారు. -
ప్రకృతి భాష... ఋతు ఘోష
తాజా పుస్తకం కాలాన్ని అనుసరించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. మారుతున్న చరిత్రకూ, చింతనకూ ఆహ్వానం పలికిన అచ్చమైన కవి ఆయన. ఆయనను రుతువులు ఆకర్షించకుండా ఎలా ఉంటాయి? దాని ఫలితమే ‘ఋతు ఘోష’ పద్యకావ్యం. ఈ కావ్య రచన జరిగి యాభయ్ సంవత్సరాలు పూర్తి కావడం మరో విశేషం. ఆయన పద్య కవిత్వం నుంచి వచన కవిత్వానికి ప్రయాణించారు. ఆయన కథకుడు, నాటక కర్త. గొప్ప వ్యాసకర్త. ఇదంతా కాల ప్రభావం. కానీ ఛందోబద్ధ కవిత్వంలోనూ ఆయన తన గొంతును కాపాడుకున్నారు. ‘ఋతు ఘోష’లో అదే కనిపిస్తుంది. ‘చిక్కని చిగురాకు జీబులో పవళించి యెండు వేణువు కంఠమెత్తి పాడె’ (వసంతరుతువు) అని చదువుకున్నపుడు ఛందస్సుల సవ్వడులేవీ మనకు అనుభవానికిరావు. ‘నిర్మలాకాశంపు నీలాటి రేవులో పండువెన్నెల నీట పిండి ఆరేసిన తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి’ (శరత్తు) ‘బండలు లాగుచుం బ్రతుకు భారము మోయు నభాగ్యకోట్లు నా గుండెలలోన నగ్నదరి కొల్పుము తీవ్ర నిదాఘవేళన్’ అని కూడా ఎలుగెత్తి చాటగల కలం శేషేంద్రది. ఛందస్సు, భాషల పరిధి దాటి కవిత్వాన్ని ఆస్వాదించగలిగేవాళ్లంతా ‘ఋతు ఘోష’ ను వినగలరు. ఇది చిన్న కావ్యమే. కానీ శేషేంద్ర రచనల మీద కొన్ని విశ్లేషణలను కూడా ఇందులో చేర్చారు. ‘ఋతు ఘోష’ /శేషేంద్ర/ నవోదయ, కాచిగూడ, హైదరాబాద్/పే 108, వెల రూ. 100/- - గోపరాజు