స్కూటర్.. సూపర్..
ఇది భవిష్యత్ తరం స్కూటర్ డిజైన్. పేరు ఎక్స్‌క్యూ. బ్రెజిల్‌కు చెందిన రికార్డో సిల్వా దీన్ని డిజైన్ చేశారు. ఎక్స్‌క్యూ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ స్కూటర్ బాడీని సౌర ఫలకాలతో రూపొందించారు. ఇవి చక్రాల్లో ఉండే ఇంజిన్‌కు విద్యుత్‌ను అందిస్తాయి.
అదే సమయంలో మామూలుగా చార్జింగ్ చేసుకునే సదుపాయమూ ఉంది. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసే విద్యుత్‌తో ఫోన్, లాప్టాప్ వంటి వాటిని కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ స్కూటర్ హ్యాండిల్ వద్ద కెమెరాలు ఉంటాయి. దీని వల్ల వెనక వస్తున్న వాహనాలు వంటి వాటి వివరాలు కెమెరాలకు అనుసంధానించి ఉండే స్మార్ట్ ఫోన్ తెరపై ప్రదర్శితమవుతాయి.
మన స్కూటర్ల తరహాలోనే లోపల లగేజీ పెట్టుకునే సదుపాయమూ ఉంది. స్కూటర్ బరువు కూడా తక్కువ. ఇందులో ఉండే ‘ఆఫ్’ మోడ్ ప్రెస్ చేస్తే.. హ్యాండిల్, సీటు లోపలకు వెళ్లిపోతాయి. దీంతో ఎంచక్కా ఈ స్కూటర్‌ను బస్సులో లేదా ట్రైన్లో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని చెబుతున్నారు.