Rice trader
-
బియ్యం వ్యాపారి ఆత్మహత్యాయత్నం
ఏలూరు టౌన్: అధికారుల వేధింపులు తాళలేక ఏలూరులో ఒక బియ్యం వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. తాను బియ్యం వ్యాపారం చేస్తున్నానని, అక్రమాలేవీ లేకపోయినా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వలేనని చెప్పడంతో అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితుడు చెప్పాడు.బాధితుడు, అతని కుమారుడి కథనం మేరకు వివరాలు.. జంధ్యావుల సుధాకర్ అలియాస్ నాని గత కొంతకాలంగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇళ్ల వద్దకు వెళ్లి ఎవరైనా బియ్యం విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి రెండు, మూడు రూపాయలు ఎక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్ముతూ ఉంటాడు. ఈ నెల 11న సుధాకర్ పెదవేగి మండలం పినకడిమిలో బియ్యం కొనుగోలుకు వెళ్లాడు. అదే సమయంలో పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్ అక్కడికి వెళ్లారు. వేరే బియ్యం బస్తాలను సుధాకర్‌కు చెందిన వ్యాన్‌లో వేయించి, బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడంటూ కేసు నమోదు చేస్తానని బెదిరించారు.రూ.50 వేలు ఇస్తేనే కేసు లేకుండా చేస్తానని, లేకుంటే కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. ‘నాకు డబ్బులు ఇవ్వాల్సిందే.. లేదంటే నీ చావు నువ్వు చావు.. నాకు సంబంధం లేదు..’ అంటూ తేల్చి చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవటంతో డీటీ ప్రమోద్ కేసు నమోదు చేసి, పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుధాకర్ ఈ నెల 12న పురుగుల మందు తాగి పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.పోలీసులు స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పడంతో తన కుమారుడు పృథ్వీని స్టేషన్ వద్దకు రమ్మని చెప్పాడు. అనంతరం తాను విషం తాగిన విషయాన్ని కుమారుడికి చెప్పడంతో వెంటనే ఏలూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్ను దీనిపై వివరణ కోరగా.. సుధాకర్ నుంచి తాము డబ్బులు డిమాండ్ లేదని చెప్పారు. 650 కిలోల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. -
బియ్యం వ్యాపారి దారుణ హత్య
గుడ్లూరు : రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు గురై శుక్రవారం పొలాల్లో శవమై కనిపించాడు. పరకొండపాడు పంచాయతీ పరిధిలోని వడ్లమూడివారిపాలెం గ్రామ పొలాల్లో పొగాకు తోటల్లో పరిగ ఆకులు ఏరుకోవటానికి వెళ్లిన మహిళలకు గంగయ్య అనే రైతు పొలంలో జమ్మి చెట్టు కింద మృతదేహం కనిపించడంతో స్థానిక రైతులకు విషయం తెలియజేశారు. వారు గుడ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు సీఐ లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. కందుకూరులోని వాసవీ నగర్లో నివాసం ఉండే నూకల వెంకటసుబ్బయ్య హోల్‌సేల్ వ్యాపారుల వద్ద బియ్యం కొనుగోలు చేసి అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 4వ తేదీ షాపుకు వెళుతున్నానని భార్య అపర్ణకు చెప్పి ఇంటి వద్ద నుంచి వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అపర్ణ భర్త వెంకటసుబ్బయ్యకు ఫోన్ చేసింది. ఫోన్ పనిచేయకపోవడంతో బంధువులకు సమాచారం అందించింది. వారు షాపు వద్దకు వెళ్లి చూడగా మూసి ఉండటంతో బయటకు వెళ్లి ఉంటాడని భావించారు. అయితే రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో 5వ తేదీ బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేసినా వెంకటసుబ్బయ్య జాడ కనిపించలేదు. రాత్రికి రూరల్ పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. సీఐ లక్ష్మణ్ శుక్రవారం ఉదయం వాసవీనగర్‌కు వెళ్లి వెంకటసుబ్బయ్య భార్య అపర్ణ వద్ద వివరాలు సేకరించారు. అదే సమయంలో వడ్లమూడివారిపాలెం గ్రామ పొగాకు తోటల్లో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని సమాచారం అందుకున్న సీఐ అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడకు అర కిలోమీటరు దూరంలో మృతుడి మోటారుసైకిల్ కూడా ఉంది. మోటారు సైకిల్ నంబరు ఆధారంగా మృతుడు కందుకూరుకు చెందిన వెంకట సుబ్బయ్యగా నిర్ధారించారు. సీఐ లక్ష్మణ్ మాట్లాడుతూ దుండగులు వెంకట సుబ్బయ్య (39)ను ఇక్కడకు తీసుకొచ్చి చంపి వెళ్లిఉంటారని తెలిపారు. తలపై బలమైన గాయాలు ఉండటంతో కత్తితో గానీ గొడ్డలితోకానీ కొట్టి చంపి ఉంటారని పేర్కొన్నారు. రెండు రోజులు క్రితం హత్య జరిగిఉండడంతో మృతదేహం ఉబ్బి ఉంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సీఐ వెంట ఏఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు.