వ్యాపారిని రూ.50 వేలు డిమాండ్ చేసిన డీటీ
ఇవ్వలేదని కేసులు పెట్టారంటూ ఆవేదన
ఏలూరు టౌన్: అధికారుల వేధింపులు తాళలేక ఏలూరులో ఒక బియ్యం వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. తాను బియ్యం వ్యాపారం చేస్తున్నానని, అక్రమాలేవీ లేకపోయినా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వలేనని చెప్పడంతో అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితుడు చెప్పాడు.
బాధితుడు, అతని కుమారుడి కథనం మేరకు వివరాలు.. జంధ్యావుల సుధాకర్ అలియాస్ నాని గత కొంతకాలంగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇళ్ల వద్దకు వెళ్లి ఎవరైనా బియ్యం విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి రెండు, మూడు రూపాయలు ఎక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్ముతూ ఉంటాడు. ఈ నెల 11న సుధాకర్ పెదవేగి మండలం పినకడిమిలో బియ్యం కొనుగోలుకు వెళ్లాడు. అదే సమయంలో పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్ అక్కడికి వెళ్లారు. వేరే బియ్యం బస్తాలను సుధాకర్‌కు చెందిన వ్యాన్‌లో వేయించి, బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడంటూ కేసు నమోదు చేస్తానని బెదిరించారు.
రూ.50 వేలు ఇస్తేనే కేసు లేకుండా చేస్తానని, లేకుంటే కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. ‘నాకు డబ్బులు ఇవ్వాల్సిందే.. లేదంటే నీ చావు నువ్వు చావు.. నాకు సంబంధం లేదు..’ అంటూ తేల్చి చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవటంతో డీటీ ప్రమోద్ కేసు నమోదు చేసి, పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుధాకర్ ఈ నెల 12న పురుగుల మందు తాగి పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.
పోలీసులు స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పడంతో తన కుమారుడు పృథ్వీని స్టేషన్ వద్దకు రమ్మని చెప్పాడు. అనంతరం తాను విషం తాగిన విషయాన్ని కుమారుడికి చెప్పడంతో వెంటనే ఏలూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్‌ను దీనిపై వివరణ కోరగా.. సుధాకర్ నుంచి తాము డబ్బులు డిమాండ్ లేదని చెప్పారు. 650 కిలోల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment