బడా రైతులూ..బహుపరాక్
సాక్షి,న్యూఢిల్లీః పన్నులు ఎగవేసేందుకు వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపును సాధనంగా వాడుకుంటున్న బడా రైతులపై ప్రభుత్వం కన్నేసింది.రూ 50 లక్షలు మించి వ్యవసాయ ఆదాయాన్ని చూపిన 50 అనుమానాస్పద వ్యక్తుల జాబితాను ఆదాయ పన్ను శాఖ రూపొందించింది.2016, మార్చి నాటికి రూ కోటి పైగా వ్యవసాయ ఆదాయం చూపిన పన్నుచెల్లిందారుల వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని గత ఏడాది డిసెంబర్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంట్లో పేర్కొన్నారు. వ్యవసాయ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉండటంతో ఈ మినహాయింపును ప్రజలు బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకు వాడుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది.కొందరు వ్యవసాయ భూముల యజమానులు భూములను విక్రయించకముందు వాటిని తాము సాగు చేసినట్టు తెలిపేందుకు నకిలీ పేమెంట్ స్లిప్‌లను పొందుపరుస్తూ పన్ను మినహాయింపు కోరుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇలాంటి పన్ను ఎగవేతదారులను అడ్డుకునేందుకు ఆదాయ పన్ను శాఖ పకడ్బందీగా వ్యవహరిస్తోంది. శాటిలైట్ ఇమేజరీ పరికరాలతో ఆయా భూముల్లో పంటలు వేసారా లేదా అనే విషయాలను నిగ్గుతేల్చేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదాయ పన్ను శాఖ సమీకరించింది. అయితే సంపన్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమవుతుండటంతో ఆ దిశగానూ సర్కార్ కసరత్తు చేస్తుందని భావిస్తున్నారు.