రిచ్‌ఇండియా ఎండీని నిలదీసిన ఏజెంట్లు
ఉదయగిరి రూరల్: రిచ్ ఇండియా కంపెనీ ఎండీ నేరెళ్ల వేణుగోపాల్‌ను పలువురు ఏజెంట్లు చుట్టుముట్టారు. తాము చెల్లించిన నగదు చెల్లించాలని నిలదీశారు. ఈ ఘటన సోమవారం ఉదయగిరిలో జరిగింది. ఏజెంట్ల కథనం మేరకు.. జలదంకి మండలం చోడవరానికి చెందిన వేణుగోపాల్ 2010లో రిచ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. నెల్లూరు కేంద్రంగా వింజమూరు, నంద్యాల, పొద్దుటూరు, కర్నూలు, కందుకూరు లో బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు.
చెల్లించి న నగదుకు తక్కువ కాలంలోనే రెట్టిం పు ఇస్తామని ఆశచూపి ఏజెంట్ల ద్వారా సుమారు రూ.2.50 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఏడాది పాటు సక్రమం గా చెల్లించారు. అనంతరం నష్టాలు రావడంతో సంస్థ ఆస్తులను ‘విగార్’ కంపెనీకి అప్పచెప్పి నగదు పొందారు. ఆనగదుతో సీతారామపురం మండలం చింతోడు వద్ద పొలాలు కొనుగోలు చేసి శ్రీగంధం మొక్కలు నాటారు. బాండ్ల కాల పరిమితి ముగియడంతో ఏజెంట్లు నగదు చెల్లించాలని గతంలో అతన్ని పట్టుబట్టారు. ఆ సమయంలో చింతోడులోని పొలాలను ఇస్తానంటూ అగ్రిమెంట్ చేశారు.
ఇటీవల ఆ పొలాలను పరిశీలించిన ఏజెంట్లు అవి ఎందుకూ పనికిరావని గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించి ఎండీని నిలదీయాలని భావించారు. ఈ క్రమంలో నంద్యాల, వింజమూరు ప్రాంతాలకు చెందిన ఏజెంట్లు పొలం రిజిస్ట్రేషన్‌కు వేణుగోపాల్‌ను పిలవడంతో సోమవారం ఉదయగిరి వచ్చాడు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టి నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు గమనించి వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కేసులు అవసరం లేదని ఏజెంట్లు పేర్కొనడంతో ఆయనను వదిలేశారు. తన ఇంటితో పాటు పొలాలను రాసిచ్చేందుకు వేణుగోపాల్ సుముఖత వ్యక్తం చేయడంతో రాజీపడ్డారు. తమకు నంద్యాల బ్రాంచ్ పరిధిలో రూ.55 లక్షలు, వింజమూరు బ్రాంచ్ పరిధిలో రూ.45 లక్షలు రావాల్సి ఉందని ఏజెంట్లు తెలిపారు.