తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి
రాజకీయాల్లోకి ప్రవేశించడానికి తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ వెల్లడించారు. బ్రిటన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఆయన కనర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా రిచ్మండ్ - యార్క్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మీడియా ముందుకు వచ్చేందుకు అంతగా ఇష్టపడని రిషి శనివారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన తండ్రి వైద్యుడిగా సేవలందిస్తే... తల్లి ఫార్మసీని నడిపేవారని చెప్పారు. వారిద్దరు ప్రజలకు సేవ చేయడాన్ని చూస్తూ తాను పెరిగానని చెప్పారు.
తన తల్లిదండ్రులు సమాజానికి అందించిన సేవలపై ఎన్నారై సమాజం చూపిన ఆదరణ మరువలేనిదని అన్నారు. అలా తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రేరణగా నిలిచిందన్నారు. బ్రిటన్‌లో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కనర్వేటివ్ పార్టీ వైపే తాను మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఆ పార్టీలోని విలువలేనని రిషి స్పష్టం చేశారు. కనర్వేటివ్ పార్టీ పాటిస్తున్న విలువలు తన మనస్సును ఎంతగానో కట్టిపడేశాయన్నారు. ఆ పార్టీకి ప్రజల పట్ల ఉండే నిబద్ధత, దయాగుణం అధికమని చెప్పారు. ప్రతి అమ్మాయి తన తండ్రే హీరో అనుకుంటుందని, తన భార్య అక్షితను దృష్టిలో ఉంచుకుని చెప్పారు.
అలాగే తన అత్తగారు సుధానారాయణ మూర్తి మంచి రచయిత్రి అని, ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ విజయవంతంగా సాగుతుందని చెప్పారు. అక్షిత సోదరుడు రోహన్ విషయానికి వస్తే మంచి వ్యక్తి అని మార్కులు వేశారు. మామయ్య నారాయణ మూర్తి తనను సొంత కొడుకులా చూసుకుంటారని తెలిపారు. మామగారి కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయసహకారాలు అందుతాయన్నారు. బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునక్ ఆయన సమీప ప్రత్యర్థి యూకే ఇండిపెండెన్స్ పార్టీ అభ్యర్థి మాథ్యూ కూక్పై విజయం సాధించారు. బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారే పోటి చేసినప్పటికీ ఆయన 51 శాతం ఓట్లు సాధించడం విశేషం.