భూ ప్రకంపనం
రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు
10 నుంచి 12 సెకన్ల పాటు కంపించిన భూమి
భయంతో జనం పరుగులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం రాత్రి 9.58 గం టల సమయంలో 10 నుంచి 12 సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. భవనాల్లో ఉన్న వారంతా కిందకు దిగిపోయారు. పలు ఇళ్లల్లో వస్తువులు, గృహోపకరణాలు కదిలాయి. తమ గృహాలు కంపించడానికి ముందు బుల్డోజర్తో ఢీకొన్నట్టు శబ్ధం వచ్చిందని పలువురు చెప్తున్నారు.
నగరంతో పాటు జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఏజెన్సీ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. పది నుంచి పన్నెండు సెకన్ల పాటు భూమి కంపించింది. చాలా చోట్ల ప్రహరీలు, ఇంటి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. దీంతో అర్ధరాత్రి దాటినా.. చాలా మంది ఇళ్లల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. రోడ్లపైనే గంటల తరబడి పడిగాపులుకాశారు.
ఈ స్థాయి ఇదే తొలిసారి
విశాఖకు ఈశాన్యంగా సుమారు 550 కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో 18.24 ఉత్తర అక్షాంశం, 87.95 తూర్పు రేఖాంశాల మధ్య 5 కి.మీ. లోతున భూకంప కేంద్రం సంభవించినట్టు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కాయిసెస్) తన వెబ్సైట్లో వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్ర 5.8గా నమోదైనట్టు పేర్కొంది. గతంలో నగరంలో భూమి కంపించినా.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2-3 పాయింట్లకు మించి లేదని నిఫుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ భూ కంప కేంద్రం కూడా నగరానికి చాలా దూరంగా ఉండడంతో ముప్పు తప్పిందన్నారు.