‘భర్త పోషించలేకపోయినా.. భార్యకు మనోవర్తి’
న్యూఢిల్లీ: హిందూ ఉమ్మడి కుటుంబంలో ఒక హిందూ పురుషుడు శారీరక వైకల్యానికి గానీ, మానసిక వైకల్యానికి గానీ గురైనా, అదృశ్యమైనా, ప్రపంచాన్ని పరిత్యజించినా.. అతడి హిందూ భార్యకు జీవితాంతం సదరు పురుషుడి కుటుంబ సభ్యులే మనోవర్తిని చెల్లించాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఈ కొత్త నిబంధనను హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం 1956లో సెక్షన్ 18(4)గా చేర్చాలని ప్రతిపాదించింది. అయితే.. సదరు భర్త ఉమ్మడి కుటుంబం ఆస్తిలో తన వాటాను పొందివున్నట్లయితే ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.
భర్త కుటుంబ పోషణ అందించలేని పరిస్థితిల్లో ఉన్న హిందూ మహిళ హక్కును పరిరక్షించాలని భావిస్తున్నట్లు న్యాయమంత్రి సదానందగౌడకు సమర్పించిన తన నివేదికలో వివరించింది. ప్రస్తుత చట్టంప్రకారం.. భర్త కుటుంబానికి పోషణ అందించలేని స్థితిలో ఉన్నపుడు అతడు ఉమ్మడి కుటుంబ సభ్యుడు అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యుల నుంచి మనోవర్తి పొందే హక్కు మహిళకు లేదని కమిషన్ పేర్కొంది.
అలాంటి మహిళలకు ఉన్న ఉపశమనాలు.. తన భర్త తరఫున ఆస్తి వాటా కోసం దావా వేయటం లేదా విడాకుల కోసం దావా వేయటం మాత్రమేనని వివరించింది. గత ఏడాది ఒక కేసు విచారణ నేపథ్యంలో.. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయ కమిషన్కు సూచించింది. ఈ నేపధ్యంలో కమిషన్ తాజా నిబంధనను సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించింది.