రెట్.. రైట్
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించడంతో ప్రవాసాంధ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగకు సొంత ఊర్లకు పయనమయ్యారు. నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజూ 350కి పైగా బస్సు సర్వీసులు తిరుగుతుంటాయి. ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో పాల్గొనడంతో బస్సులన్నీ క్రమంగా బెంగళూరు వైపు వస్తున్నాయి.
శనివారం ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 250కి పైగా బస్సు సర్వీసులు పంపించామని స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్వ్రీంద్రనాథ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, కాళహస్తి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని కనిగిరి, ఉదయగిరి, కావలి ప్రాంతాల నుంచి శనివారం రాత్రి బస్సులు ఇక్కడికి చేరుకున్నాయని తెలిపారు. కనుక ఆ మార్గాల్లో కూడా సర్వీసులను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.
కేఎస్ ఆర్టీసీ కూడా...
సమైక్యాంధ్ర ఉద్యమంతో ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు నిలిపి వేసిన బస్సు సర్వీసులను కేఎస్ ఆర్టీసీ కూడా పునరుద్ధరించింది. చిత్తూరు, తిరుపతి మార్గంలో 450కి పైగా సర్వీసుల సంచారం ప్రారంభమైంది.