తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం రద్దు చేయాలి
– లేకుంటే జిల్లా నుంచి సాగనంపుతూ
– జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మిపై కలెక్టర్ ఆగ్రహం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పనిచేయాలంటే వారం రోజుల్లో తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి తక్షణమే అసలైన భూమి గల యజమానికి న్యాయం చేయాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుని, జిల్లా నుంచి సాగనంపుతానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్షి్మని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఏలూరు సత్రంపాడుకు చెందిన బచ్చు నాగవెంకటేశ్వరరావుకు చెందిన 761 గజాల స్థలాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన భాస్కర్ వారం రోజుల్లో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, ఆ రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు కూడా తప్పుడు రిజిస్ట్రేషన్‌కు కారణ మైన సిబ్బందే పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలా చేయకుంటే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకూ వెనుకాడనని హెచ్చరించారు.
పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం
ఆకివీడు మండలానికి చెందిన బొల్లం వెంకట సుబ్బారాయుడు ఫిర్యాదు చేస్తూ ఆకివీడు పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నా కార్యదర్శులు స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. జిల్లాలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ప్రతి వారం మీ కోసం కార్యక్రమంలో 90 శాతం ఫిర్యాదులు పంచాయతీ శాఖకు చెందినవే ఉంటున్నాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే శాఖను పటిష్ట పరచకుంటే తాను ప్రక్షాళకు పూనుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌ను హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామ రైతులు టి.సత్తిరెడ్డి, ఆర్ఒ రామ్మోహన్‌రెడ్డి వినతిపత్రం అందిస్తూ యర్రకాలువ ఆధునికీకరణలో వంతెన నిర్మాణం చేపట్టారని కానీ పూర్తిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గోపాలపురం మండలం దొండపూడి, రాజుపాలెం గ్రామస్తుడు ఎన్.ఉదయభాస్కర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ కన్నాపురం నుంచి పోలవరం వెళ్లే దారిలో దొండపూడిలో రోడ్లకు ఇరువైపులా ఆర్అండ్బీ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు, పక్కా గహాలు నిర్మించుకున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్అండ్బీ అధికారులు ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. మరికొందరు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్‌డీఎంవో ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, డీపీవో సుధాకర్, ఇరిగేషన్ ఎస్ఈ ఇ.శ్రీనివాస్, డీఎస్వో శివశంకరరెడ్డి పాల్గొన్నారు.