పతకం తెస్తే పురస్కారం గ్యారంటీ!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులను తక్షణమే తగురీతిలో గుర్తిస్తామని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ హామీయిచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ లో పతకాలు గెలిస్తే అవార్డులు ఇస్తామని ప్రకటించింది. విజేతల పేర్లను ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు పరిగణన తీసుకుంటామని వెల్లడించింది.
దీంతో ఒలింపిక్స్ లో ఆటగాళ్లు పతకాలు గెలిచిన తర్వాత అవార్డుల కోసం ఏడాది కాలం పాటు వేచిచూడాల్సిన అవసరం తప్పింది. వ్యక్తిగత విభాగంలో పతకాలు సాధించిన వారి పేర్లను దేశ అత్యున్నత క్రీడాపురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'కు సిఫారసు చేస్తామని చెప్పింది. క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటనతో ఒలింపిక్స్ లో పాల్గొనబోయే ఆటగాళ్లకు సరికొత్త ప్రోత్సాహం లభించినట్టైంది.