'టాప్'కు జయరామ్ పేరు సిఫారుసు!
న్యూఢిల్లీ:ఇటీవల కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో విశేషంగా రాణించిన బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ పేరును టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో చేర్చడానికి భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసేందే టాప్. దీనిలో భాగంగానే బ్యాడ్మింటన్ నుంచి జయరామ్ పేరు తెరపైకి వచ్చింది. గతేడాది గాయం కారణంగా ఆరు నెలలకు పైగా బ్యాడ్మింటన్ కు దూరంగా ఉన్న జయరామ్... ఇటీవల జరిగిన కొరియా ఓపెన్ సిరీస్ లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచాడు.
భారత స్టార్ ఆటగాళ్లు నిష్క్రమించిన చోటే జయరామ్ సత్తా చాటుకుంటూ తుది రౌండ్ వరకూ వెళ్లాడు. దీంతో అతని పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ మేరకు బాయ్ అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా మాట్లాడుతూ.. ఈ మధ్య జరిగిన కొరియా ఓపెన్ లో జయరామ్ అద్భుతంగా రాణించాడని.. ఇందుకు సంబంధించి అతని ప్రొఫైల్ ను టెక్నికల్ కమిటీ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు 2012 లో జరిగిన లండన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ బెర్తును జయరామ్ తృటిలో కోల్పోయిన సంగతిని అఖిలేష్ గుర్తు చేశారు.
ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్ అర్హత రేసుకు సంబంధించి పారుపల్లి కశ్యప్ తో పాటు కిదాంబి శ్రీకాంత్, ప్రణోయ్, అజయ్ జయరామ్ ల పేర్లు టాప్ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు టాప్ లో చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటంతో వారికి టాప్ లో స్థానం కల్పించారు. వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా స్థానం కల్పించారు.