కల్లోల నదిలో కిక్కే కిక్కు
⇒ గంగానదిలో తప్ప మరెక్కడా లేదు
⇒ కాళీ నదిలో రివర్ ర్యాఫ్టింగ్ సందడి
⇒ వర్షాలతో మొదలైన సీజన్
⇒ దండేలి అభయారణ్యంలో జల హోరు
బెంగళూరు: జర్రున దూసుకుపోయే నది ప్రవాహంతో సమానంగా పోటీపడుతూ పడవలో దూసుకెళ్లడం, రాళ్లు, గుట్టలు, కొండల నడుమ నుంచి మెరుపు వేగంతో కదులుతూ నదీ జలాల్లో సయ్యాటలాడడం మంచి థ్రిల్లింగ్ అనుభూతి. ఇలాంటి కిక్‌నిచ్చే సవాళ్లు కావాలంటే నదిలో ర్యాఫ్టింగ్ చేయాల్సిందే. అది కూడా కాళీ నదిలో అయితే మరీ బాగుంటుంది.
ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు. పచ్చని అడవుల అందాలు, లోయల సౌందర్యం, అరుదైన పశుపక్ష్యాదులను చూసి ఆనందిస్తుంటారు. దీంతో పాటు దేశంలో గంగానదిలో తప్ప మరెక్కడా కనిపించని వైట్ వాటర్ ర్యాఫ్టింగ్ దండేలి అడవుల గుండా ప్రవహించే కాళీ నదిలో మాత్రమే లభ్యం.
ఏమిటీ రివర్ ర్యాఫ్టింగ్
ఇక్కడ అడవుల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే కాళీ నది జూన్ నుంచి ఉధృతంగా ప్రవాహాన్ని అందుకుంటుంది. ఇక నదీజలాల్లో ర్యాఫ్టింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు కూడా ఇక్కడికి పయనమవుతారు. ఇక్కడ ఉన్న పలు క్లబ్‌లు, రిసార్ట్లు ర్యాఫ్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్లాస్టిక్, రబ్బర్ బోట్లలో 10–15 మంది కూర్చుని పొంగిపొర్లే నదీజలాల్లో ప్రయాణించడం ఒక వింత అనుభూతి. గజ ఈతగాళ్లు, నిపుణులు పడవను నురగలు కక్కే నదీజలాల్లో కొండలను, బండలను తప్పించుకుంటూ దూకుతూ బోట్‌ను తీసుకెళ్తుంటే సందర్శకుల గుండెలు ఉద్విగ్నతతో లయ తప్పుతాయి.
కొందరు ర్యాఫ్టింగ్ ప్రి యులు తామే పడవలను తీ సుకుని సొంతంగా నదిలో విహా రానికి బయల్దేరతారు. ఇది కొన్ని గంటలు ఉండవచ్చు, కొ న్ని రోజులు కావచ్చు. మధ్యలో మజిలీలు వేస్తూ టెంట్లలో కాలం గడుపుతూ సిటీ లైఫ్ ఒత్తిళ్ల నుంచి దూరంగా సేదదీరుతారు. వర్షాలు ఆరంభం కావడంతో కాళీ నదిలో కూడా ర్యాఫ్టింగ్ సందడి మొదలైంది.
ఎలా వెళ్లాలి?
బెంగళూరు నుంచి 480 కిలోమీటర్ల దూరం. దండేలికి బెంగళూరు, బళ్లారి, హుబ్లి–ధార్వాడ, మైసూరు, బెళగావి తదితర నగరాల నుంచి బస్సు సర్వీసులున్నాయి. రైల్లో అయితే లోండాకు వెళ్లి అక్కడి నుంచి గంటన్నర బస్సు ప్రయాణంతో దండేలిలో దిగవచ్చు.
ఎక్కడ ఉండాలి?
దండేలిలో ఆర్థిక స్థాయిని బట్టి బస చేయడానికి తగిన రిసార్ట్లు, హోటళ్లు లభ్యం. కొంచెం ఖర్చు పెట్టగలిగితే ఆధునిక సౌకర్యాలు, ఆతిథ్యంతో కూడిన బస దొరుకుతుంది. బడ్జెట్ హోటళ్లూ ఉన్నాయి. ఇక సాహసాలు చేయాలనుకుంటే జంగిల్ సఫారీ, రివర్ ర్యాఫ్టింగ్ చేయవచ్చు. ఇవే కాకుండా ఈ దట్టమైన అరణ్యంలో ఊరికే అలా గడిపినా ఎంతో హాయిగా ఉంటుందంటారు సందర్శకులు. ఇంకా చుట్టుపక్కల సింధేరి కొండలు, ఉలవి శ్రీక్షేత్రం ఆలయం, అంబికా నగర, కావాల గుహలను సైతం తిలకించవచ్చు.