మిశ్రధాతువుల కేంద్రంగా హైదరాబాద్!
డీఆర్డీవో డీజీ అవినాశ్ చందర్
రీయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రక్షణ, విమానయాన రంగాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ రానున్న కాలంలో మిశ్రధాతువుల (కాంపోజిట్స్) తయారీలోనూ కీలకపాత్ర పోషించనుందని డీఆర్డీవో డెరైక్టర్ జనరల్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లోని హైటెక్స్ కేంద్రంలో రీయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్పై ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు (ఐసీఈఆర్పీ)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మిశ్రధాతువుల వాడకం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయన్నారు.
రైలు బోగీల్లో ఇప్పటికీ లోహాలను అధికంగా వాడుతున్నారని, మిశ్రధాతువుల వాడకంతో ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లవచ్చన్నారు. అగ్ని క్షిపణుల్లో 90 శాతం వరకూ వీటినే వాడామన్నారు.. వచ్చే పదేళ్లలో లక్ష మంది మిశ్రధాతు నిపుణులు అవసరం కావచ్చునని ఆయన అంచనా వేశారు. అంతకుముందు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రం త్వరగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
టీఎస్ఐపాస్ ద్వారా న్యాయ, పరిపాలన అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మిశ్రధాతువుల రంగానికి ప్రోత్సాహమిచ్చేందుకు హైదరాబాద్లో 100 ఎకరాల్లో పారి శ్రామికవాడను ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో ఓవెన్స్ కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్ మార్సియాస్ సండ్రీ, ఎఫ్ఆర్పీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సుభాష్ విట్టల్దాస్లు పాల్గొన్నారు.