'ప్రభుత్వ కళాశాలల్లో సీసీ టీవీలు'
రామాయంపేట (మెదక్) : వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ టీవీలతోపాటు బయో మెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్ బోర్డ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) మల్హల్రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అసలు సహించబోమన్నారు. నిర్ణీత వేళలకు అనుగుణంగా సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్ ఫలితాల మెరుగు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. లెక్చరర్ల కొరత అధిగమించడానికి పార్ట్ టైం ఉద్యోగులకు నియమిస్తామన్నారు.