జిల్లాలో మావోయిస్టుల కదలికల్లేవు
నర్సాపూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని అడిషనల్ ఎస్పీ ఆర్ మధుమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నర్సాపూర్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టుల కదలికలు లేక పోయినా, కూంబింగ్‌లు చేపడుతున్నామన్నారు. గతంలో వారి ప్రభావం ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటును వినియోగించుకునే విధంగా జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తమ శాఖ కృషి చేస్తోందన్నారు. అందరూ ఓటు వేసి వంద శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోను కావొద్దని, ఎవరైనా ప్రలోభ పెడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తూ మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.