‘అభాగ్యులకోసం’ ప్రత్యేకవార్డు
రిమ్స్ ( కడప అర్బన్ )
రిమ్స్‌లో అభాగ్యుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకట శివ సోమవారం ఆయా విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
– ఐపీ విభాగంలోని మొదటి అంతస్తులో ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లెకు చెందిన నారాయణ (55) అనే వ్యక్తి అస్వస్థతలో పడి వుండటం గమనించారు. వెంటనే అతన్ని విచారిస్తే తాను ప్రొద్దుటూరు నివాసినని, మా బంధువులు వస్తారనీ తెలిపారు. అతన్ని ప్రత్యేక వార్డులో చేర్పించమని ఆర్ఎంఓ ఆదేశించారు.
– క్షయ నివారణ వార్డు బయట కడప మాసాపేటకు చెందిన శివ అనే రోగి ఆరుబయట నిద్రిస్తుండగా అతన్ని ఆర్ఎంఓ విచారించారు. అతను వెంటనే లేచి తాను నెల రోజుల నుంచి క్షయ నివారణ విభాగంలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. సరిగా మందులు వాడుతున్నాని మొదట వచ్చినప్పటికీ, ఇప్పటికీ బాగుందని తెలిపారు.
– ఐపీ విభాగంలో ఐడి వార్డును ‘అభాగ్యుల కోసం’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును ఆర్ఎంఓ పరిశీలించారు. మొదట పడక మంచంపై వున్న వ్యక్తిని పలుకరించారు. తన పేరు విజయకుమార్ అని, తనకు పాత బస్టాండ్ సమీపంలో 20 రోజుల క్రితం ప్రమాదం జరిగిందని తెలిపారు. తనను ఆటోలో రిమ్స్‌కు తీసుకుని వచ్చి చేర్పించారని తెలిపారు. ఆ విషయం తన సోదరి లలితమ్మకు కూడా ఇంతవరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచూకీ లేనివారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు.