పండగవేళ విషాదం
దెందులూరు : పండగ వేళ.. సోమవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. దెందులూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. దెందులూరు ఎస్ఐ ఎన్.ఆర్.కిషోర్‌బాబు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన భార్యాభర్తలు మాకినేని నాగవెంకట శ్రీనివాస్ (40), మహాలక్ష్మి సోమవారం ద్విచక్రవాహనంపై ఏలూరు వైద్యశాలకు బయలుదేరారు. దెందులూరు వద్దకు వచ్చేసరికి పెట్రోల్ అయిపోవడంతో బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య కాలు నుజ్జునుజ్జయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
తెడ్లం గ్రామంలో..
టి.నరసాపురం : తెడ్లం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తోకల రాంబాబు (30) మరణించాడు. ఎస్ఐ కె.నాగేంద్రప్రసాద్ కథనం ప్రకారం.. రాంబాబు స్థానిక రైతు సుబ్బారావు వద్ద కొంతకాలంగా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై ఆ రైతు పొలం నుంచి రాంబాబు తన కుమార్తెను ఎక్కించుకుని తెడ్లం వస్తుండగా, చింతలపూడి నుంచి కామవరపుకోట వైపు వెళ్లే వ్యాన్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం వెనుక కూర్చొన్న రాంబాబు కుమార్తె సమీపంలోని తుప్పల్లో పడటంతో ఆమెకు ఎటువంటి గాయాలూ కాలేదు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.