నెంబర్1కు చిర్రెత్తుకొచ్చింది!
సెర్బియా దిగ్గజం, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ కు ఎలాంటి అంచనాలు లేని ఓ ప్లేయర్ షాకిచ్చాడు. దీంతో షాంఘై మాస్టర్స్ టోర్నీలో సెమిఫైనల్స్ రౌండ్ నుంచి ఇంటిదారి పట్టాడు. షాంఘై మాస్టర్స్ లో భాగంగా శనివారం జరిగిన సెమిఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ రొబర్టో బాటిస్టా చేతిలో 6-4, 6-4 తేడాతో రెండు వరుస సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. కేవలం తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో మూడుసార్లు మాత్రమే ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేశాడు. రొబర్టో ఆటకు జొకో నుంచి సరైన సమాధానం లేకపోయింది. దీంతో రొబెర్టోను సులువుగా విజయం వరించింది.
డిఫెండింగ్ చాంపియన్, 12 గ్రాండ్ స్లామ్స్ విన్నర్ అయిన జొకో ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే తాను ధరించిన టీషర్టును విప్పి చైర్ అంపైర్ వైపు పడేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు. క్వార్టర్స్ లో జర్మనీ ప్లేయర్ మిస్కా జ్వెరేవ్ చేతిలో ఓటమి తప్పించుకున్న డిఫెండింగ్ చాంపియన్ కు సెమిస్ లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. రాకెట్ ను పదే పదే విసిరికొడుతూ వింతగా ప్రవర్తించాడు. బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే నుంచి టాప్ ర్యాంకుకు గట్టిపోటీ ఉండటం, వరుస టోర్నీల్లో మధ్యలోనే ఇంటిదారి పట్టడం లాంటి కారణంగా జొకోవిచ్ ఇలా చేసి ఉండొచ్చునని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.