Robotic Process
-
పాలీహౌస్‌ల కోసం రోబోటిక్ స్ప్రేయర్
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్ స్ప్రేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్ హౌస్‌లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు. పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు. ప్రత్యేకతలివీ.. ♦ ఈ పరికరం రిమోట్ కంట్రోల్‌తో కిలోమీటర్ మేర పనిచేస్తుంది. ♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్ ఆన్ చేసి రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ను కనెక్ట్ చేసుకోవాలి. ♦ రిమోట్ ద్వారా కమాండ్ సిగ్నల్స్‌ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్ ద్వారా మెషిన్ దిశను మార్చుకోవచ్చు. ♦ కంట్రోలర్ బటన్ ద్వారా మెషిన్ వేగం, స్ప్రేయర్ పీడనం మార్చుకోవచ్చు. ♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్ను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. ♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత. ♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు. ♦ 10–20 లీటర్ల లిక్విడ్ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయగల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. కృత్రిమ మేధస్సుతో.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలు, మొబైల్ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్ యంత్ర పరికరాలు, వివిధ సాఫ్ట్వేర్స్ రూపకల్పన కోసం ఆదికవి నన్నయ, జేఎన్టీయూకే, ఎన్ఐటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రోటోటైప్ రోబోటిక్ స్ప్రేయర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్!!
-
2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్!!
♦ ఆటోమేషన్ ప్రభావం ఇది... ♦ అమెరికా సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ బెంగళూరు: దేశీ ఐటీ రంగంలో ఆటోమేషన్ వల్ల 2022 నాటికి దాదాపు 7 లక్షల లో–స్కిల్డ్ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ‘హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్’ ఒక నివేదికలో పేర్కొంది. మీడియం–స్కిల్డ్, హై–స్కిల్డ్ ఉద్యోగాలు మాత్రం వరుసగా లక్ష వరకు, 1.9 లక్షల వరకూ పెరగవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా చూస్తే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు నికరంగా 7.5 శాతం తగ్గొచ్చని పేర్కొంది. అమెరికా, యూకే, ఇండియా వంటి దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉద్యోగాల కోతకు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను ప్రధాన కారణంగా చూపింది. ఇక ఫిలిప్పీన్స్‌లో ఐటీ ఉద్యోగాలు స్వల్పంగా పెరిగే అవకాశముందని తెలిపింది. కాగా ప్రస్తుత నేపథ్యంలో మొత్తం సిబ్బందిలో 20 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరమని, అప్పుడే వారు ఉద్యోగాల్లో కొనసాగగలరని అభిప్రాయపడింది. -
గర్భసంచి సమస్యలకు రోబోటిక్ ప్రక్రియ మేలు
క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. బాగా లావుగా ఉంటాను. ఇటీవల మెనోపాజ్ వచ్చింది. రుతుస్రావం ఆగిపోయి దాదాపు ఐదేళ్లు అవుతోంది. కానీ గత మూడు నెలల నుంచి అప్పుడప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవుతోంది. ఆ సమయంలో నొప్పిలు నన్ను విపరీతంగా బాధిస్తున్నాయి. చాలా మంది వైద్యులను సంప్రదించాను. ఒక డాక్టర్ కొన్ని టెస్ట్‌లు నిర్వహించి గర్భసంచి తీసివేస్తే గానీ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. దీంతో మా కుటుంబ సభ్యులంతా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నాం. నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. - ఒక సోదరి, నిర్మల్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. మహిళల్లో ఈ సమస్య ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా సురక్షితం కాని లైంగిక సంబంధాలతో పాటు జన్యుపరమైన కారణా వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో టీబీకి గురైనవారిలో కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి మీరు వెంటనే నిపుణులైన సర్జికల్ ఆంకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండే పెద్ద ఆసుపత్రికి వెళ్లి సంప్రదించండి. వారు మీకు ముందుగా అల్ట్రా సౌండ్ లాంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో మీరు గర్భాశయ క్యాన్సర్‌కు లోనైనట్లు తెలిసినా ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికిత్సకు సంబంధించి అత్యంత అధునాతనమైన విధానాలు, నిపుణులైన వైద్యులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. క్యాన్సర్ ఏ గ్రేడింగ్‌లో ఉందో తెలుసుకోడానికి అలాగే ఆ క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు ఏమైనా పాకిందా కనుగొనడానికి సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలూ చేస్తారు. ఒకవేళ మొదటి లేదా రెండో దశలో ఉంటే మీకు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ గర్భసంచిని తొలగించడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు చింతించాల్సిన పనేమీ లేదు. దాన్ని తొలగించిన తర్వాత మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. అలాకాకుండా మూడు లేదా నాలుగో స్టేజ్‌లో ఉంటే గర్భసంచి తొలగించడంతో పాటు క్యాన్సర్ కణాలను పూర్తిగా నిర్మూలించడానికి రేడియో థెరపీ, కీమోథెరపీ నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఇప్పుడు అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధానంలో 3డి కెమెరా సహాయంతో శరీరంలోని కీలకమైన అవయవాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం ప్రభావితమైన కణజాలాన్ని సమూలంగా తుడిచిపెట్టేయవచ్చు. - డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్ సెన్సైస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్