జేమ్స్ బాండ్‌గా చేసేకన్నా చచ్చిపోవడం బెటర్!
‘బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి.
అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. ఇప్పటివరకూ సీన్ కానరీ, రోజర్ మూర్.. ఇలా పలువురు నటులు జేమ్స్ బాండ్‌గా అలరించారు. ఆ తర్వాత డేనియల్ క్రెగ్ ఈ పాత్రను పోషించడం మొదలుపెట్టారు. 2006లో ‘కాసినో రాయల్’, 2008లో ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, 2012లో ‘స్కైఫాల్’ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. త్వరలో విడుదల కానున్న ‘స్పెక్టర్’లో నాలుగో సారి ఈ పాత్ర చేశారు. ఐదో సారి మాత్రం ఈ పాత్ర చేయడానికి ఆయన సిద్ధంగా లేరు.
‘మళ్లీ జేమ్స్ బాండ్‌గా నటించేకన్నా చచ్చిపోవడం బెటర్. ఒకవేళ నటించాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా గాజు ముక్కతో నా మణికట్టుని కోసేసుకుంటా’ అంటున్నారు డేనియల్. దీన్నిబట్టి జేమ్స్ బాండ్ పాత్ర పోషణ పరంగా ఆయన ఎంత అలసిపోయారో ఊహించవచ్చు. ఎవరైనా మరీ బలవంతం చేస్తే, కనీసం మరో రెండేళ్లు ఆగమంటానని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఒకవేళ ఒప్పుకోవాలనిపిస్తే, అది డబ్బు కోసమే తప్ప వేరే కారణాలేవీ ఉండవని కూడా స్పష్టం చేశారు.