రోహింగ్యాలతో భద్రతకు ముప్పు’
న్యూఢిల్లీ / ఢాకా: భారత్‌లో ఉంటున్న రోహింగ్యా ముస్లింలు జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. రోహింగ్యా ముస్లింలను భారత్ నుంచి తిప్పిపంపకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిల్‌పై కేంద్రం ఈ మేరకు అభిప్రాయాన్ని వెల్లడించింది. పలువురు రోహింగ్యాలకు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయని కేంద్రం పేర్కొంది.
జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్, మేవట్ ప్రాంతాల్లో రోహింగ్యా తీవ్రవాదులు చురుగ్గా ఉన్నారని, వీరిని ఐసిస్ వంటి ఉగ్రసంస్థలు వాడుకునే ప్రమాదముందని సుప్రీంకు నివేదించింది. అయితే సుప్రీంకు అందిన అఫిడవిట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, పొరపాటున కోర్టుకు అందిందని కేంద్రం వివరణ ఇచ్చింది. బంగ్లాలో రోహింగ్యా శరణార్థుల కోసం 53 టన్నుల ఆహార పదార్థాలు, నిత్యావసరాల్ని పంపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.