తెలంగాణపై రైల్వే నిర్లక్ష్యం
సందర్భం
బ్రిటిష్ ఇండియా 96 ఏళ్ల (1853 -1947) హయాంలో 53 వేల కిలో మీటర్ల రైలుమార్గం నిర్మించారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతంలో నిర్మించిన రైలుమార్గం 10 వేల కి.మీ. మన పాలకులు రైల్వే వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం వహి స్తున్నారో చెప్పడానికి ఈ ఉదాహ రణ చాలు. ఇక భద్రత, పరిశుభ్రత కూడా అంతంత మాత్రమే. ఈ అంశాల పరిశీలన కోసం అనిల్ కకోద్కర్, శాంపిట్రోడా ఇచ్చిన నివేదికలు కూడా అమలుకు నోచుకోలేదు.
2004-2011 మధ్య రైల్వే ప్రయాణికుల చార్జీలు ఏమీ పెంచకుండా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. నడికుడి-బీబీనగర్ మధ్య కొత్త రైలుమార్గం మినహా, మరో మార్గమేదీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 బడ్జెట్లో బులెట్ రైళ్లను ప్రవేశపెడతామని చెప్పింది. తొమ్మిది ప్రధాన మార్గాలలో 160- 200 కి.మీ. వేగంతో రైళ్లను నడిపేందుకు కూడా ఆ బడ్జెట్ ఆమోదించింది. 2015-16 రైల్వే బడ్జెట్ మరీ ప్రత్యేకమైనది. ఒక్క కొత్త రైలును కూడా అది ప్రవేశ పెట్టలేదు. తొమ్మిది హైస్పీడ్, సెమీ హైస్పీడ్ మార్గాలలో ఏ ఒక్క దానికీ పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల దశాబ్దా లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి రాకుండా, పారిశ్రామికోత్పత్తులు, వ్యవసా యోత్పత్తులు అధికంగా జరిగే ప్రాంతాలకు విస్తరించకుండా ఆదాయం ఎలా పెరుగుతుంది? 1947 నాటి దేశ జనాభా 35 కోట్లు. నేటి జనాభా 120 కోట్లు పైనే. పెరిగిన 85 కోట్ల జనాభాకు అనుగుణంగా రైల్వేలు విస్తరించలేదు. ప్రాజెక్టు లలో తీవ్ర జాప్యం, అధిక వ్యయం, అవినీతి వంటి వాటితో రైల్వే సతమతమవుతోంది.
రైలు ప్రయాణం కూడా రోజురోజుకూ భారమవు తోంది. 2014, జూన్ నుంచి ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. అదే సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రీమియర్ తత్కాల్ విధానంతో 50 శాతం టికెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. సంవిధ రైళ్ల పేరుతో 20 శాతం టికెట్ల మీద 50 శాతం ధర పెంచి అమ్ముతున్నారు. అంటే 20 శాతం ప్రయాణికులకు మూడు రెట్ల చార్జీని వసూలు చేస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. ఇది 2015 జూలై నుంచి అమలవుతున్నది. ప్లాట్‌ఫాం టికెట్‌ను కూడా రూ. 5 నుంచి రూ.10లకు పెంచారు. రిజర్వేషన్ వ్యవధిని 120 రోజులు ముందుకు తెచ్చి, రద్దు చార్జీలను భారీగా పెంచారు. ఇలా టికెట్ల రద్దు ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వస్తోంది.
చిత్రంగా ప్రభుత్వాలు కొత్త మార్గాల నిర్మాణం, కొత్త రైళ్లు నడపడం, అదనపు బోగీలను జత చేయడం, కేటరింగ్ సదుపాయాలు వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తూనే, ఈ- కేటరింగ్, వైఫై, వేగవంతంగా రిజర్వేషన్, మొబైల్ యాప్; టెక్నాలజీ వెబ్సైట్, బయో టాయ్‌లెట్స్ అంటూ చిన్న చిన్న అంశాలను బడ్జెట్లో హైలైట్స్‌గా చూపుతున్నారు. గత దశాబ్ద కాలంలో కాట్రా-ఉదంపూర్ మార్గాన్ని (345 కి.మీ.) 2014 జూలైలో ప్రారంభించడం తప్ప, మరో మార్గమేదీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఒక్కొక్క రాష్ట్రానికి సంవత్సరా నికి రూ. 1,000 కోట్ల వంతున కేటాయిస్తే ప్రతి రాష్ట్రంలో నాలుగేసి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఇందు కోసం నాలుగేళ్ల కాలంలో రూ.28,000 కోట్ల వంతున కేటా యిస్తే 112 కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే వేల కోట్లతో వ్యాపారాలు నిర్వహించే పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో రూ. 500 కోట్లు వెచ్చించి ఒక్కొక్క మార్గాన్ని నిర్మించి జాతికి అంకితం చేయ వచ్చు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కొత్త మార్గాల నిర్మాణానికి నిధులు కేటాయించవచ్చు. అలాగే గ్రీన్ స్టేషన్లు, మోడల్ స్టేషన్లు, గ్రానైట్ స్టేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఆపాలి.
తెలంగాణ దుస్థితి
నిజాం పాలన తరువాత 1966లో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నడికుడి నుంచి సికింద్రాబాద్ శివార్లలోని బీబీనగర్ మధ్య 163 కి.మీ. మార్గాన్ని నిర్మించడం మినహా మరో మార్గమేదీ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పెద్దపల్లి- కరీంనగర్-నిజామాబాద్ మధ్య 177 కి.మీ. మార్గానికి 1994లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు అనుమతిం చారు. ఇందులో పెద్దపల్లి-కరీంనగర్ మార్గం నిర్మాణం 2001 నాటికే పూర్తయింది. కానీ కరీంనగర్-నిజామాబాద్ మార్గం పనులు నేటికీ పూర్తి కాలేదు. భద్రాచలం -కొవ్వూరు మధ్య కొత్త మార్గం నిర్మాణ ప్రతిపాదనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మోక్షం లభించలేదు. 2010లో అను మతి లభించినా ఇంతవరకు నిర్మాణం ఆరంభం కాలేదు. మణుగూరు-రామగుండం, అక్కన్నపేట-మెదక్-మేడ్చల్, కొండపల్లి-కొత్తగూడెం, గద్వాల్-మాచర్ల మార్గాల నిర్మా ణానికి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే ఒప్పందం జరిగింది. 50:50 ఖర్చు భరించేందుకు అంగీకారం కుదిరింది. అయినా నిర్మాణం ఆరంభం కాలేదు. వీటిని 2010-11 బడ్జెట్లో ఆమోదించారు. 2011-12 బడ్జెట్లో అక్కన్నపేట-మెదక్, భద్రాచలం- కొవ్వూరుల ప్రస్తావన ఉంది.
మహబూబ్‌నగర్-గుత్తి, సికింద్రాబాద్-మద్కేడ్- ఆది లాబాద్ మార్గాలలో రెండవ మార్గం నిర్మాణానికి ఆమోదం లభించింది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి ఆమోదం లభించినా కేటాయింపులు లేవు. కరీంనగర్- నిజామాబాద్ మార్గం పూర్తయితే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. చెన్నై, ముంబై, తిరుపతి వెళ్లేవారికి సౌకర్యం పెరుగుతుంది. భద్రాచలం-కొవ్వూరు మార్గం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు బెంగాల్ వైపు నేరుగా రాక పోకలు సాగించవచ్చు.
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రమే కాదు, పెద్ద కూడలి. నిత్యం 130 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కానీ పది ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే ఉండడం వల్ల కొన్ని రైళ్లు గంటల తరబడి స్టేషన్ బయట వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచే సూచన ఏదీ లేదు. దీనితో నిత్యం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచి కొన్ని రైళ్లను నేరుగా అక్కడకు పంపడం వల్ల సికింద్రాబాద్‌కు ఒత్తిడి తగ్గుతుంది. చర్లపల్లిని టెర్మినల్‌గా పెట్టాలని భావిస్తున్నా, అది సమస్యను పరిష్కరించేది కాదు. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్ సౌకర్యం, మెడికల్ షాపుల ఏర్పాటు, పరిశుభ్రమైన ఆహారం అందుబాటులోకి తేవాలి. 50:50 ప్రాతిపదికన ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయాలి.
(రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా)
వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ కాంపెయిన్ సభ్యురాలు ఎం. రోజాలక్ష్మి
మొబైల్: 94410 48958