ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని వివక్ష
కట్నం కోసం వేధింపులు
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
రొంపిచెర్ల: ఆడబిడ్డకు జన్మనిచ్చాననే వివక్ష చూపడమే కాకుండా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మహిళా దినోత్సవం రోజే ఓ మహిళ బుధవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన టిప్పుసుల్తాన్తో 2016 ఫిబ్రవరి 4న చిన్న మసీదువీధికి చెందిన హసీనాకు (21) పెద్దల సమక్షంలో నిఖా (వివాహం) చేశారు. వివాహ సమయంలో 80 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు కట్న కానుకల కింద హసీనా కుటుంబ సభ్యులు ఇచ్చా రు. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధం అంటగట్టి, వేధింపులకు తెరతీశారు.
సీమంతం సమయంలో అదనంగా 80 గ్రాముల బంగారు నగలు ఇవ్వాలని పట్టుబట్టారు. హసీనా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చావంటూ హసీనాను తూలనాడారు. అంతేకాకుండా తన భర్తకు మరో వివాహం చేస్తానంటూ అత్త బెదిరించేందని, తన భర్త సైతం రెండో వివాహానికి సిద్ధపడ్డాడని, తాను ఇక పుట్టింటిలోనే ఉండాలంటూ అత్తింటివారు ఆంక్షలు విధించారని హసీనా వాపోయింది. తాను ప్రసవించి 4 నెలలైనా పుట్టింటిలోనే ఉన్నానని గోడు వెళ్లగక్కింది. అంతేకాకుండా దుల్హన్ పథకం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలను కూడా తనను మభ్యపెట్టి మొత్తం డబ్బును అత్తింటి వారు కాజేశారని తెలిపింది. అత్త అయిషా, చిన్న మామ బావాజీ, తాత అల్లాబ„Š , తన భర్త అదనపు కట్నం కోసం వేధించారని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది.