డ్రగ్స్ రహిత భారత్’ను సాధిస్తాం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం నుంచి డ్రగ్స్ భూతాన్ని తరిమేస్తుందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశం గుండా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికడుతుందని స్పష్టం చేశారు. సోమవారం ‘ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్’సందర్భంగా అమిత్ షా ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇతర శాఖలు, విభాగాల సమన్వయంతో తమ హోం శాఖ అమలు చేస్తున్న నార్కోటిక్స్ వ్యతిరేక జీరో–టాలరెన్స్ విధానం విజయవంతమైందని, సానుకూల ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంలో విజయం సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆ వీడియోల అమిత్ షా స్పష్టం చేశారు.
201–2022 సంవత్సరాల మధ్యలో సమష్టి చర్యల ఫలితంగా రూ.22 వేల కోట్ల మాదకద్రవ్యాలను సీజ్ చేశామన్నారు. ఇవి 2006–13 సంవత్సరాల మధ్య స్వాధీనం చేసుకున్న రూ.768 కోట్ల డ్రగ్స్ కంటే 30 రెట్లు ఎక్కువని వివరించారు. 2006–13 మధ్యలో డ్రగ్స్ విక్రేతలపై 1,257 కేసులు నమోదు కాగా, 2014–22 సంవత్సరాల్లో 3,544 కేసులు పెట్టినట్లు చెప్పారు. ఇవి 181 శాతం అధికమన్నారు. వీటితోపాటు 2022 జూన్ నుంచి ఇప్పటి వరకు 600 టన్నుల డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉమ్మడిగా సాగించిన కృషి వల్లనే సాధ్యమైందని అన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా అన్ని విభాగాలు డ్రగ్స్‌పై పోరాటాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ కుటుంబాలను ఈ మహమ్మారికి దూరంగా ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు.