టాస్క్‌ఫోర్స్ అదుపులో రౌడీషీటర్ గొల్లకిట్టు?
రాంగోపాల్‌పేట్: ఓ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో రౌడీషీటర్ గొల్లకిట్టు అలియాస్ చిన్నబోయిన కృష్ణయాదవ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2012 సంవత్సరంలో గొల్లకిట్టు ..అతని అనుచరులు కలిసి శేఖర్ అనే ఆటోడ్రైవర్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో శేఖర్ తల్లి ఎం.నరసమ్మ ప్రత్యక్ష సాక్షి ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి.
గత కొద్ది రోజుల నుంచి నరసమ్మను కేసు వాపసు తీసుకోవాలని, రూ.10 లక్షల నగదు ఇస్తామని గొల్లకిట్టు ఒత్తిడి చేశారు. లేకపోతే మరో కుమారుడు రమేష్‌ను చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా మే నెల 9వ తేదీన ఆమె కుమారుడు రమేష్‌ను గొల్లకిట్టు అనుచరులు మారేడుపల్లిలోని బద్రీనాథ్‌యాదవ్ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. అక్కడే గొల్లకిట్టు, బద్రీనాథ్యాదవ్తో పాటు ఈశ్వర్‌యాదవ్, సన్నీయాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. బలవంతంగా రమేష్‌తో సంతకాలు సేకరించారు.
రమేష్ చేతిలో రూ.5 లక్షలు పెట్టి మిగతా డబ్బు కేసు వాపసు చేసుకున్న తర్వాత జాయింట్ అకౌంట్లో వేస్తామని చెప్పి బెదిరించి పంపించారు. డబ్బు తీసుకుని రమేష్ ఇంటికి వెళ్లి దాన్ని బంధువుల వద్ద దాచారు. ఆ తర్వాత నర్సమ్మ ఉత్తర మండలం డీసీపీని ఆశ్రయించడంతో 10 మంది నిందితులపై మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే బద్రీనాథ్‌యాదవ్, సాయియాదవ్, శ్యామ్సుందరెడ్డి, రాజు యాదవ్ అలియాస్ (పురుగురాజు) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా గొల్లకిట్టును అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.