ప్రణబ్ ముఖర్జీ రాయని డైరీ
జోర్డాన్‌లో దిగి చాలా సేపయింది. ఇక్కడి రాయల్ కోర్టులో ఇంకా తెల్లవారలేదు. రాష్ట్రపతి భవన్లో అయితే ఈపాటికి కాఫీలు, టిఫిన్లు పూర్తయి ఉండేవి. జోర్డాన్.. ఇండియా కన్నా రెండున్నర గంటలు వెనకుంటుందని ఫ్లయిట్ దిగుతున్నప్పుడు థావర్ చంద్ గెహ్లాట్ చెప్పాడు. మోదీ గవర్నమెంట్లో ఆయన సోషల్ జస్టిస్ మినిస్టర్. జోర్డాన్ అయినా, ఇండియా అయినా గంటలు నిమిషాల్లో వెనకబడిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. సోషల్ జస్టిస్‌లో యుగాల వెనక్కి వెళ్లకుండా ఉంటే చాలు.
ఇవాళ, రేపు జోర్డాన్‌లో. తర్వాతి మూడు రోజులు పాలస్తీనాలో, ఇజ్రాయెల్‌లో. కొన్ని స్పీచ్‌లు, కొన్ని సంతకాలు, కొన్ని టూర్లు.. చిన్నచిన్నవి. ఇజ్రాయెల్ అయితే ముందే చెప్పేసింది, జెరూసలేంలోని అల్ అఖ్సా మసీదును మాత్రం చూడ్డం కుదరదని! పాలస్తీనా బాంబులేస్తోందట. సెక్యూరిటీ కష్టమట. అల్ అఖ్సా.. అక్కడి టెంపుల్ మౌంట్ కాంపౌండ్‌లో ఉంది. ఆ కాంపౌండ్లోనే యూదులు, క్రైస్తవుల ప్రార్థనాలయాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ ఒకే చోట చూడ్డం ఎంత అదృష్టం. రెలిజియస్ డెమోక్రసీ!
డెమోక్రసీ! అందమైన మాట.
సత్యమేవ జయతేలా, జనగణమనలా, వందేమాతరంలా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలా! చరిత్రలో ఎన్ని నాగరికతలు వర్ధిల్లలేదు? ఎన్ని క్షీణించలేదు? ఇండియా మాత్రం అలానే నిలిచి ఉంది. విలువల్ని కాపాడుకుంటోంది. సహనమూర్తి నా దేశం. సహనశీలత మన నాగరికత. ఎవరో అన్నారు.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ మాట ఇప్పుడెందుకు చెబుతున్నారు.. రిపబ్లిక్ డే కాదు కదా, ఇండిపెండెన్స్ డే కాదు కదా అని. నిజమే. కానీ అప్పుడప్పుడు జరిగే దురదృష్టకర సంఘటనల్ని కూడా జాతీయ ప్రాముఖ్యం ఉన్న సందర్భాలుగానే భావించాలి.
ఎదురుగా కాఫీ టేబుల్ మీద ప్రభు చావ్లా రాసిన పుస్తకం ఉంది. ‘ది నేషనలిస్ట్ ప్రెసిడెంట్-ప్రణబ్ ముఖర్జీ’. వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్నాను. పుస్తకం రిచ్‌గా ఉంది. కవర్‌పేజీ మీద నేనూ రిచ్‌గానే ఉన్నాను.. సూటు వేసుకుని, కుషన్ సీట్లో కూర్చుని! మరి నా లోపలి నేషనలిస్ట్.. పుస్తకం లోపల ఎలా ఉన్నాడో. కూర్చునా? నిల్చునా? నేషనలిస్ట్ ఎప్పుడూ నిటారుగానే ఉండాలి. పుస్తకం చూడలేదు. రాత్రి ఫ్లయిట్లో చూడ్డానికి కుదరలేదు. ఇండియా తిరిగి వెళ్లేలోపు కొన్ని పేజీలైనా తిరగేయాలి.
ఫిష్ కర్రీ, మృదువైన చపాతీలు నా కోసం సిద్ధంగా ఉన్నాయని జోర్డాన్ రాజప్రాసాదం నుంచి కబురు! వాళ్ల బ్రేక్‌ఫాస్ట్ వేరు. వీటిని నాకోసం ప్రత్యేకంగా చేయించారు.. నాకు చేపలంటే ఇష్టమని. జోర్డాన్ నది నుంచి పట్టి తెచ్చారట! పాలన.. రాచరికం. ఆతిథ్యం.. ప్రజాస్వామ్యం. అన్నట్లు.. డెమోక్రసీలోని ఇంకో గొప్ప సంగతి.. నచ్చింది తినే స్వతంత్రం.
- మాధవ్ శింగరాజు