రైతు రుణ లక్ష్యం రూ. 10 కోట్లు
జలుమూరు: రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పది కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శిమ్మ జగదీశ్వరరావు తెలిపారు. డీసీసీబీ పరిధిలోని 49 పీఏసీఎస్‌ల పరిధిలో 350 కోట్లరూపాయల విలువ ధాన్యాన్ని ఈ ఏడాది కొనుగోలు చేయడం ద్వారా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు కమిషన్ రుపేణా లాభాలు అర్జించామన్నారు. చల్లవానిపేట పీఏసీఎస్‌ను గురువారం సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్, రబీలో రైతులకు రూ. 10 కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
రుణ మాఫీకి సంబంధించి మొదటి విడతలో రూ.79.35 కోట్లు, రెండో విడతలో రూ. 18.46 కోట్లు అయ్యిందన్నారు. రూ. 240 కోట్లు వర్తించాల్సి ఉండగా రూ. 180 కోట్లు అర్హత పొందారని ఇంకా రూ. 60 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటికీ రుణ మాఫీ కాని రైతులు రైతు సాధికారికా సంస్థలో ఫిర్యాదు చేసుకోవాలన్నారు. నరసన్నపేటలో డీసీసీబీ బ్రాంచి భవన నిర్మాణాలు పూర్తయ్యావని, మే నెలలో వీటిని ప్రారంభిస్తామన్నారు. ఈయన వెంట మేనేజర్ డీవీఎస్ రమణమూర్తి, అధ్యక్షుడు వాన కనకయ్య, సీఈవో భాస్కర్ పట్నాయక్ ఉన్నారు.