ఆల్ టైమ్ రికార్డులో మార్కెట్ విలువ!
ముంబై : బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. గురువారం ఉదయం ట్రేడింగ్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎమ్-క్యాప్) రూ.107 లక్షల కోట్లకు ఎగబాకింది. 2015 ఏప్రిల్ లో 106.85లక్షల కోట్ల రికార్డును గురువారం నాటి ట్రేడింగ్ బద్దలు కొట్టింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ మొదటిసారి 2014 నవంబర్ లో రూ.100లక్షల కోట్ల రికార్డును ఛేదించింది. మార్కెట్ విలువలో ఆల్ టైమ్ రికార్డులను తాకుతూ ప్రపంచంలోని టాప్-10 ఎక్స్చేంజీలలో ఒకటిగా బీఎస్ఈ ఆవిర్భవించింది. మరోవైపు లిస్టయిన కంపెనీల సంఖ్యా రీత్యా కూడా టాప్ ర్యాంకులో కొనసాగుతుండటం విశేషం. బీఎస్ఈ-లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడిదారుల సంపదను మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కొలుస్తారు.
ప్రస్తుతం 2,400కు పైగా కంపెనీలు బీఎస్ఈలో ట్రేడ్ అవుతున్నాయి. కొత్త కంపెనీల లిస్టింగ్ ల జోరు కొనసాగుతుండటంతో, బీఎస్ఈలో మార్కెట్ క్యాపిలైజేషన్ యేటికేటికి పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ.11,799 కోట్లతో మొదటిసారి ఎల్&టీ ఇన్ఫోటెక్ నేడు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయింది. మార్కెట్ వాల్యుయేషన్ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి తాకడంతో, బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 6.88 శాతం పెరిగి, 1,798.35 పాయింట్ల వద్ద తన ర్యాలీని కొనసాగిస్తోంది. ప్రస్తుతం రూ.4,90,538.04 కోట్ల వాల్యుయేషన్ తో టీసీఎస్ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా పేరొందుతోంది. టీసీఎస్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రూ.3,27,600.39 కోట్లు), హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు(రూ.3,11,811.40 కోట్లు), ఐటీసీ(రూ. 3,04,536.08 కోట్లు), ఇన్ఫోసిస్(రూ.2,47,656.57 కోట్లు)లు ఉన్నాయి.