జిల్లాకు రూ.160కోట్లు రాక
సాక్షి, కడప : ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాను నగదు కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కానీ, శనివారం ఉదయంలోపు దాదాపు రూ.160కోట్లు జిల్లాకు వస్తున్నాయి. శనివారం ఆ నగదు వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి బ్యాంకులకు ఆ మొత్తాలను సరఫరా చేయనున్నారు. జిల్లాకు రూ.160కోట్లు వస్తున్నట్లు ఎల్డీఎం లేవాకు రఘునాథరెడ్డి సాక్షికి స్పష్టం చేశారు. అయితే ఈ మొత్తం వస్తే కొంత ఊరట లభించవచ్చన్నారు.
రూ. 2,103 కోట్లకు చేరిన డిపాజిట్లు
నవంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో రూ.2103 కోట్లు డిపాజిట్లు జరిగాయి. అయితే బ్యాంకు అధికారులు అప్పటినుంచి ఇప్పటివరకు రూ. 953కోట్లను ప్రజలకు పంపిణీ చేశారు. శుక్రవారం కూడా రూ.35కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు మొత్తం రాగా.. మరో రూ. 32కోట్లు బ్యాంకు అధికారులు ఉద్యోగులకు, పెన్షనర్లకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎల్డీఎం రఘునాథరెడ్డి నిర్ధారించారు.