రూ.2.25 కోట్ల ఐఫోన్లను కొట్టేసిన ఆ ఇద్దరు
న్యూఢిల్లీ : ఐఫోన్ అంటేనే అత్యంత ఖరీదు. అది కొనాలంటే చేతిలో ఎక్కువ డబ్బులుండాల్సిందే. అలాంటి ఐఫోన్లను కొట్టేసి, వేరేవాళ్లకి అమ్మేస్తే ఎంచక్కా కోట్లు సంపాదించవచ్చనుకున్నారు ఓ ఇద్దరు. గ్యాంగ్‌గా ఏర్పడి దాదాపు 2.25 కోట్లు విలువచేసే 900కు పైగా ఐఫోన్ 5ఎస్ స్మార్ట్ ఫోన్లను ఓ ట్రక్ నుంచి కొట్టేశారు. తెలివిగా ఐఫోన్లను కొట్టేసిన వీరు ఆఖరికి పోలీసుల చేతికి చిక్కేశారు. దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మహిపాల్‌పూర్‌కు చెందిన మెహతాబ్ అలామ్(24), ఆర్మాన్(22)లు గ్యాంగ్‌గా ఏర్పడి, ఐఫోన్లను పట్టుకెళ్తున్న ట్రక్నుంచి సెప్టెంబర్13న ఈ దొంగతానికి పాల్పడ్డారు. 900 పైగా ఐఫోన్లతో ఈ ట్రక్ దక్షిణ ఢిల్లీలోని ఓక్లా ప్రాంతం నుంచి నైరుతి ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి వెళ్తుంది.
రాజోక్రి ఫ్లైఓవర్ దగ్గర్లో ట్రక్ డ్రైవర్‌పై దాడిచేసిన అనంతరం, ట్రక్కు నుంచి 900 ఐఫోన్లను చోరీ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(సౌత్) ఈశ్వర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ కేసు విచారణలో మరో ఇద్దరు దొంగలు బోలా, ప్రదీప్‌లను గుర్తించినట్టు పోలీసు అధికారి చెప్పారు. వారిద్దరూ ఈ ట్రక్కుకు మాజీ డ్రైవర్లని, రెండు వారాల క్రితమే వీరు ఉద్యోగం మానేసినట్టు వెల్లడించారు. మొబైల్స్ తీసుకెళ్తున్న ఈ ట్రక్ మార్గాన్ని సంఘటన జరిగిన రోజు ఆ ఇద్దరు డ్రైవర్లు రహస్యంగా వెంటాడారని, అదును చూసుకుని గ్యాంగ్‌తో ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసు అధికారి తెలిపారు. బోలా, రాహుల్, జితేందర్లతో ఈ ఇద్దరు ముఠాగా ఏర్పడి దొంగతనం చేశారని, ఈ ఘటనతో మిగతా గ్యాంగ్ మెంబర్లపై పోలీసులు రైడ్స్ నిర్వహిస్తూ అరెస్టు చేస్తున్నారు.