'సర్వశిక్షా అభియాన్' అంతా కనికట్టు
స్వరశిక్షా అభియాన్.. అదో మాయా ప్రపంచం. ఇక్కడ అంతా ఇంద్రజాలికులే. స్కూల్ అదనపు తరగతి గదులు ఉండవు. కానీ రికార్డుల్లో పక్కా కట్టడాలు నిర్మించినట్టు ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగం పనులు నిర్వహించరు. కానీ అన్ని పూర్తయినట్లు రికార్డుల్లో ఉంటాయి. పూర్తి చేసిన ప్రతి పనికి ఉండాల్సిన ఎంబుక్‌లు ఒక్కటీ కనిపించవు. ఇదంతా చదువులు చెప్పే సర్వశిక్షా అభియాన్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి బాగోతం. అవినీతి పరాకాష్టకు చేరడంతో సీఎంఓకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు ఆదేశించారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్‌ను విచారణకు జిల్లాకు రానున్నారు. సర్వశిక్షా అభియాన్‌లో అలజడి రేగింది. సుమారు రూ.3 కోట్ల మేర భారీగా స్వాహా చేసినట్టు సమాచారం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్‌లో చేపట్టే పనులకు లెక్కా పత్రం సక్రమంగా ఉండవు. అక్కడ కొందరు సిబ్బంది అందిన మేర దండుకోవటానికి అలవాటు çపడ్డారు. గతంలో ఏసీబీ కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా యథావిధిగా కొనసాగిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 2012 నుంచి 2015 వరకు సుమారు రూ.10 కోట్లకు పైగా విలువైన పనులు సర్వశిక్షా అభియాన్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించింది. ముఖ్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు నిర్వహించారు. అయితే ఇందులో ముఖ్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణంలో రూ.1.42 కోట్ల మేర స్వాహాకు గురైనట్లు సమాచారం. 2012–13 వార్షిక సంవత్సరంలో రూ.62.20 లక్షలు, 2013–14లో రూ.11.87 లక్షలు, 2014–15లో రూ.68.17 లక్షలు మొత్తం రూ.1.42 కోట్లు అదనపు తరగతి గదులు నిర్మించకుండా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు చేసే ప్రతి పనిని ఎంబుక్ నమోదు తప్పనిసరి. కానీ ఇక్కడ అసలు ఎంబుక్ కూడా లేని పరిస్థితి. దీనిపై గతంలో కలెక్టర్ విచారణకు ఆదేశించి నివేదిక పంపమని కోరినా అధికారులు నేటికీ పంపలేదు. జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 456 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.59 కోట్లు ని«ధులు మంజూరయ్యాయి. వీటిలో 70 శాతం అంటే రూ.79.80 లక్షలు మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా మిగిలిన 30 శాతం మెత్తం రూ. 23.94 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ ఆఫీసర్ పేరుతో కెనరా బ్యాంక్‌లో ఉన్న ఖాతాకు జమ చేశారు. అక్కడి నుంచి ఇందులో రూ.79.80 లక్షల మొత్తం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గూడూరు, కావలితో పాటు ఇతరుల ఖాతాలకు జమ చేశారు. ఈ మొత్తంతో చేసిన పనులకు సంబంధించిన ఎంబుక్ నమోదు కానీ, వర్క్ ఆర్డర్ కానీ, జేటీఓ వెరిఫికేషన్ కానీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పాసింగ్ ఆర్డర్ కానీ ఏమీ లేకుండా రూ. 40 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సివిల్ పనులకు సంబంధించి మొత్తం రూ.4.58 కోట్లు నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మొత్తం నిధులు మంజూరు ఇందులో రూ.4.05 కోట్లు విలువైన పనులు మాత్రమే చేశారు. మిగిలిన రూ. 53 లక్షలు పనులు చేయకుండా స్వాహాకు రంగం సిద్ధం చేశారు. అయితే దీనిపై దూమారం రేగడంతో ఆ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. ఇక నిర్మాణాల నాణ్యత పరిశీలించల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను ప్రెవేట్ ఏజెన్సీకి అప్పగించి వారికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఇలా ప్రతి పనిలో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. వీటిపై కార్యాలయంలో సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొందరు సీఎంను కలిసి దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంఓ విచారణకు ఆదేశించింది. సోమవారం సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ నెల్లూరులో పర్యటించి కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు.