సబ్సిడీ గ్యాస్‌పై రూ. 32 పెంపు
న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రభావం పేద, మధ్య తరగతి ఎక్కువగా వాడే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పైనా పడింది. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై జీఎస్టీ కింద 5 శాతం పన్ను విధించడంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 32 వరకూ పెరిగింది. ప్రస్తుతం రూ. 446.65గా ఉన్న 14.2 కేజీల సిలిండర్ ధర జీఎస్టీ ప్రభావంతో రూ.477.46లకు చేరింది. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్‌పై వ్యాట్, సేల్స్ ట్యాక్స్ లేదు. మిగతా రాష్ట్రాల్లో 1 శాతం నుంచి 5 శాతం మాత్రమే ఉంది.
జీఎస్టీ అమలు తర్వాత అన్ని చోట్ల 5 శాతం పన్ను అమల్లోకి రావడంతో ఇప్పటి వరకూ పన్నులేని రాష్ట్రాలు, 5 శాతం కన్నా తక్కువ పన్ను రాష్ట్రాల ప్రజలపై భారం పడనుంది. కోల్‌కతాలో రూ. 31.41, చెన్నైలో రూ. 31.41, ముంబైలో రూ. 14.28 పెరిగినట్లు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. 2011, జూన్ 25న ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. తర్వాత ఒకేసారి ఇంత మొత్తంలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. లక్షల మంది ప్రజలు వినియోగించే సబ్సిడీ గ్యాస్‌పై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.