రూ.50 లక్షలతో సెక్యూరిటీ పరారీ
తిరువొత్తియూరు : చెన్నై టీ.నగర్ ప్రముఖ నగల దుకాణం నుంచి రూ.50 లక్షలతో పరారైన సెక్యూరిటీ కోసం ప్రత్యేక పోలీసుల బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లింది. చెన్నై వేళచ్చేరిలో ప్రముఖ నగల దుకాణం ఉంది. ఈ దుకాణానికి చెన్నై, ఇతర రాష్ట్రాల్లో పలు శాఖలున్నాయి. చెన్నై వేళచ్చేరి నగల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్ బెంగళూరులో ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి రూ.50 లక్షలు తీసుకుని చెన్నై టి.నగర్లో ఉన్న నగల దుకాణం వద్దకు బుధవారం రాత్రి వచ్చారు. అక్కడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సెక్యూరిటీ అయోధ్యనాథ్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు.
అతను కాపలాదారుడిగా బెంగళూరులో ఉన్న ప్రధాన కార్యాలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసి ఐదు నెలలకు ముందు చెన్నై టీ.నగర్‌కు బదిలీ అయ్యాడు. ఇంతకు మునుపటి నుంచే పరిచయం ఉండడంతో రూ.50 లక్షల నగదును రాధాకృష్ణన్ సెక్యూరిటీకి ఇచ్చాడు. తరువాత టీ.నగర్ శాఖ మేనేజర్ దినకరన్‌కు ఫోన్‌చేసి రూ.50 లక్షల నగదు సెక్యూరిటీకి ఇచ్చినట్టు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన మేనేజర్ దుకాణం వద్దకు వచ్చి చూడగా అక్కడ సెక్యూరిటీ పరారయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి అతన్ని అరెస్ట్ చేయడానికి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు.