వెండి ధరలు ఒక్కసారిగా జూమ్
ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ లో వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో వెండి కిలో రూ 602 లు పెరిగింది. ఫెడ్ అంచనాల నేపథ్యంలో ఇటీవల విలువలైన మెటల్స్ బంగారం, వెండి ధరలు నేల చూపులు చూశాయి. 40వేల దిగువకు పడిపోయాయి. అయితే గ్లోబల్ సానుకూల అంచనాలతో మదుపర్ల భారీ కొనుగోళ్లకు దిగారు. ప్రస్తుతం కిలో వెండి రూ 41.100 పలుకుతోంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ డిసెంబర్ డెలివరీ (511 లాట్ల బిజినెస్ టర్నోవర్) వెండి కిలో 1.49 శాతం పెరిగి రూ 41,100 వద్ద ఉంది. మార్చి 2017 లో డెలివరీ (69 లాట్ల) 1.44 శాతం పెరిగివరూ రూ 41,672 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ,వెండి 2.91 శాతం పెరిగింది. సింగపూర్ లో ఔన్స్ సిల్వర్ ధరలు 16. 79 డాలర్లుగా ఉంది. అటు డాలర్ కొద్దిగా వెనక్కి తగ్గడంతో బంగారం ధరలు కూడా పుంజుకున్నాయి. ఇటీవల తొమ్మిదిన్నర నెలల కనిష్టానికి పతనమైన పసిడి ధరలు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ.204 లాభంతో రూ.28,802గా వుంది.
కాగా నష్టాలతో మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల జోరుతో క్రమంగా లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ 67, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో కీలకమైన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి.