ఒక్క సిమ్‌కార్డు.. రూ.70లక్షలు
లూథియానా: సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. వక్రమార్గంలో సంపాదించడానికి రోజుకో కొత్తమార్గం కనుగొంటున్నారు. అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మరో వ్యాపారి అకౌంట్ నుంచి ఏకంగా రూ.70లక్షలు స్వాహా చేశారు. వివరాల్లోకి వెళ్లే లూథియానాకు చెందిన అరుణ్ బేఱి గార్మెంట్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. అతనికి క్లాక్ టవర్ దగ్గరలో ఉన్న ఓ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే ఈనెల 18న ఆ అకౌంట్ నుంచి లావాదేవీలు జరినట్లు తనకు ఈమెయిల్ వచ్చింది. అంతేకాదు ఆరోజు తన ఫోన్‌కు తన ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు ఎటువంటి కాల్స్, మెస్సేజ్‌లు రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన అరుణ్ స్థానిక సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో డీసీపీ ద్రుమన్ నింబుల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హ్యాకర్లు తెలివిగా వ్యవహరించారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా అరణ్ సిమ్‌కార్డును బ్లాక్‌చేసి అదే నంబర్ మీద కొత్త సిమ్‌కార్డు తీసుకున్నారు. తర్వాత అనుకున్న ప్రకారం రూ.69.90 లక్షలను ఐదు ఖాతాలకు బదిలీ చేశారు. ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా రోజుకు రూ.5లక్షలు మాత్రమే లావాదేవీలు నిర్వహించే వీలుంది. కానీ ఏకంగా 70లక్షలు ఖాళీ అవటంపట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బ్యాంకు ఉద్యోగి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.