సీఎం వాచీ కథ సుఖాంతం!
గత వారం పది రోజులుగా మీడియాతో పాటు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేస్తున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య వాచీ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. తన వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన సీఎం.. దాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి.
తనకు ఓ ఎన్నారై మిత్రుడు ఈ వాచీని బహుమతిగా అందించాడని సీఎం సిద్దు చెప్పినా.. దాన్ని దొంగిలించిన వాచీ అని విపక్షాలు ఆరోపించాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండటంతో.. విపక్షాలు సర్కారును కడిగి పారేశాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా బీజేపీ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు.