గెయిల్ నికరలాభంలో 69 శాతం క్షీణత
న్యూఢిల్లీ: రత్నగిరి పవర్ప్లాంట్ విలువను తగ్గించి, ఆ మేరకు నష్టాన్ని ఖాతాల్లో నమోదుచేయడంతో ప్రభుత్వ రంగ గెయిల్ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 69% క్షీణతతో రూ. 260 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 983 కోట్లు. జాయింట్ వెంచర్ అయిన రత్నగిరి ప్లాంటులో గెయిల్ పెట్టుబడి రూ. 974 కోట్లుకాగా, అందులో రూ. 783 కోట్లను ఇంపైర్మెంట్ నష్టంగా ఖాతాల్లో చూపించినట్లు గెయిల్ తెలిపింది. కాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ రూ. 11,738 కోట్ల నుంచి రూ. 13,643 కోట్లకు పెరిగింది. కాగా ముగిసిన త్రైమాసికంలో తమ వ్యాపార విభాగాలన్నింటిలోనూ వృద్ధి సాధించామని, పెట్రోకెమికల్స్ అమ్మకాలు 59 శాతం, నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ పరిమాణం 11%, ట్రాన్స్మిషన్ పరిమాణం 6% వృద్ధి చెందినట్లు గెయిల్ ప్రకటించింది. కంపెనీ బోర్డు షేరుకు రూ. 2.7 చొప్పున తుది డివిడెండును సిఫార్సు చేసింది.