కుప్పకూలిన అరటి ధరలు
- వారంలో రూ.15 వేల నుంచి రూ.5వేలకు
పెద్దపప్పూరు : మార్కెట్లో అరటి ధరలు అమాంతం కుప్పకూలాయి. నెల క్రితం టన్ను అరటి కాయలు రూ.30 వేలు ఉండగా, పదిరోజుల క్రితం రూ.15 వేలకు పడిపోయాయి. ఇప్పుడు రూ.5వేలకు మించిపోవడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్లో అరటి ధరలు దాదాపు రూ.20వేలుగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 వేల హెక్టార్లలో అరటి సాగవుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 5వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు అరటి చెట్లు విరిగిపడిపోతున్నాయి. దీంతో రైతులు కాయ పక్వానికి రాక మునుపే మార్కెట్కు తరలించేందుకు సిద్ధపడుతున్నారు. వ్యాపారులు తోటలవైపు రావడం మానేశారని, దీంతో వచ్చిన కాడికి చాలనుకుంటూ అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.