జెనెరిక్ ఔషధ పరిశ్రమ పరుగులు
2020 నాటికి 28 బిలియన్ డాలర్లకు వృద్ధి
న్యూఢిల్లీ: భారత్లో జెనెరిక్ ఔషధ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుతం 13 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ జెనెరిక్ మార్కెట్ 2020 నాటికి 28 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ విషయాన్ని పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్ సంస్థ ఆర్ఎన్సీఓఎస్లు వాటి నివేదికలో పేర్కొన్నాయి. నివేదిక ప్రకారం.. భారతీయ కంపెనీలకు అమెరికా ఎఫ్డీఏ అనుమతులు లభించనుండటం, 2019 నాటికి దాదాపు 21 డ్రగ్స్ పేటెంట్ ముగియనుండటం వంటి అంశాలు జెనెరిక్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయి.
తక్కువ ధరకే సిబ్బంది లభ్యంకావడం, వ్యాధులు పెరగడం, ఔషధాల డిమాండ్ వృద్ధి వంటి కారణాల వల్ల వచ్చే ఐదేళ్లలో దేశీ ఔషధ పరిశ్రమలో జెనెరిక్ వాటా 85 శాతానికి పెరగవచ్చు. గతేడాది 15 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా మార్కెట్ విలువ 2020 నాటికి 32 బిలియన్ డాలర్లకు చేరనుంది. వృద్ధులు సంఖ్య పెరగడం, ఆదాయ వృద్ధి, వ్యాధుల సంక్రమణ పెరుగుదల, దేశీ ఫార్మా కంపెనీల విస్తరణ వంటి అంశాల కారణంగా భారత్ టాప్-3 అంత ర్జాతీయ ఫార్మా మార్కెట్లలో ఒకటిగా ఆవిర్భవించనుంది. భారత్ ఫార్మా ఎగుమతులు ఎక్కువగా అమెరికా (28 శాతం), యూరప్ (18 శాతం), ఆఫ్రికా (17 శాతం), చైనా, జపాన్, దేశాలకు జరుగుతాయి.