రాజధానిపై బాబు కుట్ర
- సీమకు ద్రోహం చేసే ప్రయత్నం
- రాజధానిని సాధించుకుంటాం
- ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ
ప్రొద్దుటూరు టౌన్: పదేళ్లపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేసే కుట్ర దాగి ఉందని రాయలసీమ విద్యార్థి వేదిక కన్వీనర్ మల్లేల భాస్కర్ విమర్శించారు. గురువారం రాయలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తి సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో భాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలు సాగనివ్వమని హెచ్చరించారు. రాయలసీమలో రాజధానిని సాధించుకుంటామంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధాని ఇవ్వకుంటే రాష్ట్రంపై పోరాడుతామని ప్రతినబూనారు. రాజధానికోసం రాయలసీమ ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే విజయవాడను రాజధాని చేయాలని చంద్రబాబు కుట్రపన్ని రాయలసీమను బలిపీఠంపై నిలిపారన్నారు.
ఒక వైపు కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇంకా పర్యటన దశలో ఉండగానే చంద్రబాబు ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోస్తాలో అధిక సీట్లు వచ్చాయని రాజధానిని కోస్తాకు తీసుకెళుతున్నామంటే రాయలసీమ ప్రజల మనసుల్లో శాశ్వత ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కోస్తా, రాయలసీమ మధ్య జరిగిన చారిత్రక శ్రీబాగ్ ఒడంబడికను చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ ఖలందర్, ఆర్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు కొండారెడ్డిలు మాట్లాడుతూ రాయలసీమలోని విలువైన అటవీ సంపద ఎర్రచందనాన్ని అమ్మి కోస్తాలో రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తామనడం సీమకు ద్రోహం చేయడమేనన్నారు.
కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు కృష్ణా జలాల్లో నికర వాటా ఇవ్వకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ద్వారా కోస్తా జిల్లాలకు కృష్ణా జలాలను తరలించుకుపోతున్నారన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజుపై జాతీయ జెండా ఎగురవేసే చంద్రబాబు రాయలసీమలోనే రాజధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబును, అతని మంత్రివర్గ సభ్యులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రొద్దుటూరు జర్నలిస్టు సం ఘం అధ్యక్షుడు వనం శర్మ, ఆర్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు జావిద్, సహాయకార్యదర్శి చరణ్, శ్రీనివాసులరెడ్డి, అభ్యాస్, షిర్డిసాయి, మాస్టర్, భావన, మేధా కాలేజి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు