rta check
-
‘వైట్’పై ఎల్లో జర్నీ.. ఏమిటీ వైట్ ప్లేట్..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొన్ని ట్యాక్సీ వాహనాలు, క్యాబ్‌లు మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. పన్నులు ఎగవేసేందుకు ఎల్లో నెంబర్ ప్లేట్ స్థానంలో వైట్ నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నాయి. ఆర్టీఏలో వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని..ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు, రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పుడు అంతర్రాష్ట్ర పన్నులు చెల్లించి తిరిగే రవాణా వాహనాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కారణంగా ట్రావెల్స్ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఈ తరహా ఉల్లంఘనల వల్ల మరింత నష్టపోవలసి వస్తోందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 వేల వాహనాలు ఇలా వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని తిరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని వాహనాలు రవాణా రంగానికి చెందినవిగానే నమోదు చేసుకున్నప్పటికీ అంతర్రాష్ట్ర పన్నుల ఎగవేత కోసం వైట్ నెంబర్ ప్లేట్‌ను వినియోగిస్తున్నాయి. కోవిడ్‌తో సంక్షోభం... గత 16 నెలలుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక, ఐటీ రంగాలు పూర్తిగా స్తంభించడం, ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రవాణా కోసం వినియోగించే అన్ని రకాల ట్యాక్సీలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, తదితర వాహనాల నిర్వాహకులు త్రైమాసిక పన్నుల నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న తాము పన్నులు కట్టలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రవాణాశాఖ త్రైమాసిక పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచి్చనట్లుగానే ఈ ఏడాది కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు ట్రావెల్స్ సంస్థల ఆందోళన ఇలా కొనసాగుతుండగా కొంతమంది మాత్రం మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి వైట్ నెంబర్ ప్లేట్‌పై తిరగడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఏ నిర్లక్ష్యం... ఎల్లో నెంబర్ ప్లేట్‌పైన తిరగవలసిన వాహనాలు అందుకు విరుద్దంగా వైట్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే వేలాది వాహనాలు ఇలా తిరుగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఏమిటీ వైట్ ప్లేట్... వ్యక్తిగత వాహనాల కోసం రవాణాశాఖ వైట్ నెంబర్ ప్లేట్‌ను కేటాయించింది. దీనిపైన నలుపు రంగులో వాహనం నెంబర్ నమోదై ఉంటుంది. ఈ వాహనాలపైన ఒకేసారి జీవితకాల పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు మాత్రం వాణిజ్య వాహనాలుగా నమోదై ఉంటాయి. వీటికి పసుపు రంగు నెంబర్‌ప్లేట్ (ఎల్లో ప్లేట్)పైన నలుపు రంగంలో నెంబర్లు నమోదై ఉంటాయి. ఈ వాహనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ పన్ను మొత్తం ఉంటుంది. -
ఇక అన్ని బస్సులు రోడ్లపైకి..
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా లాక్డౌన్ నిబంధనలతో పరిమితంగా నడుస్తూ వచ్చిన ఆర్టీసీ బస్సులు ఇక పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి.. బస్సులన్నీ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్ర వరి 1 నుంచి 9వ తరగతి ఆపై తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం, యూకే స్ట్రెయిన్ ప్రభావం అంతగా కన్పించకపోవడంతో మిగతా తరగతులు కూడా వీలైనంత తొందరలోనే ప్రారంభమవుతాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీంతో ఇక డిపోలకు పరిమితం చేస్తున్న బస్సులను కూడా బయటకు తీయాలని నిర్ణయించింది. మెరుగుపడని ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం దాదాపు 90 శాతం బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మాత్రం మెరుగుపడట్లేదు. ప్రస్తుతం 65 శాతం ఓఆర్ నమోదవుతోంది. ప్రస్తుతం జనంలో కోవిడ్ భయం దాదాపు పోయింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో జనంలో ధైర్యం వచ్చింది. కొద్దోగొప్పో భయంతో ఉన్నవారు కూడా క్రమంగా రోజువారీ పనుల్లో బిజీ అయిపోతున్నారు. కానీ బస్సులెక్కే ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగట్లేదు. బస్సు ప్రయాణం సురక్షితం కాదన్న ఉద్దేశంతోనే ప్రయాణికులు బస్సులకు దూరంగా ఉంటున్నారన్న భావనతో ఆర్టీసీ ఉండేది. అయితే కొద్దిరోజులుగా అధికారులు వివిధ ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. ఆటోలు సహా ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్న తీరును గుర్తించారు. కోవిడ్ భయం ఉంటే ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రయాణించేవారు కాదని నిర్ధారణకు వచ్చారు. వెరసి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించటానికి అలవాటు పడి ఆర్టీసీని దూరం చేసుకుంటున్నారని గుర్తించారు. ప్రజల్లో మార్పు వచ్చేలా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. (చదవండి: చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు) ఆర్టీఏ ఆధ్వర్యంలో తనిఖీలు.. ప్రైవేటు వాహనాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రమాదకరంగా తిరుగుతున్న తీరును ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ దృష్టికి తెచ్చారు. దీనివల్ల ప్రమాదాలు జరగటంతో పాటు ఆర్టీసీ కూడా తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు. దీంతో ఇక కొంతకాలం పాటు ప్రైవేటు వాహనాలపై కొరడా ఝలిపించాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఆర్టీసీకి అటాచ్ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించే వాహనాలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల ప్రయాణికులు మళ్లీ బస్సుల వైపు మళ్లుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మే వరకు కష్టకాలమే.. శుభకార్యాలంటే ఆర్టీసీకి పండుగే. ఆ సమయంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ప్రస్తుతం శుభముహూర్తాల కాలం ముగిసింది. మే రెండో వారం వరకు ముహూర్తాలు కూడా లేవు. దీంతో బస్సు ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగదని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి రద్దీ కూడా ఈ సారి తక్కువగానే ఉంది. తిరుగుపయనమైన వారి సంఖ్య కూడా బస్సుల్లో తక్కువగా నమోదైంది. పండుగ తర్వాతి రోజు ఎక్కువ రద్దీ ఉంటుందని ఊహించినా.. ఆశించినంతగా నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సగటు ఓఆర్ 66 శాతంగా నమోదైంది. ఆదాయం రూ.12.54 కోట్లుగా తేలింది. గత సంక్రాంతి సమయంలో ఇది రూ.14 కోట్లుగా నమోదైంది. ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రమే ఓఆర్ 70 శాతం మించింది. -
ఆర్టీసీ బస్సులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీఏ దృష్టి సారించింది. ప్రమాదాలకు పాల్పడే ఆర్టీసీ డ్రైవర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సాధారణంగా ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఇతర రవాణా వాహనాలు, వ్యక్తిగత వాహనాలను లక్ష్యంగా చేసుకొనే ఆర్టీఏ అధికారులు తాజాగా ఆర్టీసీ బస్సులను సైతంఆ జాబితాలో చేర్చారు. ప్రమాదాలకు కారకులయ్యే ఆర్టీసీ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సును 3 నుంచి 6 నెలల వరకు సస్పెన్షన్ చేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. అలాగే ప్రమాదాలు జరిగిన సమయంలో బస్సుల కండీషన్, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఆర్టీసీ బస్సుల కారణంగా జరిగే ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో సిటీ బస్సుల ప్రమాదాల నియంత్రణపై ఆర్టీఏ దృష్టి సారించింది. ‘ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ నియమాలను బేఖాతరు చేస్తున్నారు. సిటీ బస్సులపైనే ప్రతి రోజు వందల కొద్దీ ట్రాఫిక్ చలానాలు నమోదవుతున్నాయి. ఇది రాష్ డ్రైవింగ్‌కు నిదర్శనం.’అని జేటీసీ పేర్కొన్నారు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది. వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపైన అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలను, డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. మరోవైపు వాహనాలు నడిపే సమయంలో పాటించాల్సిన మెలకువలపై నగరంలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు జేటీసీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ డ్రైవర్లలో కూడా అవగాహన పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలకు పాల్పడే ఆర్టీసీ డ్రైవర్లు ఇక నుంచి కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రమాదాల తీవ్రత ఎక్కువ.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 3,550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో కనీసం వెయ్యి బస్సులు కాలం చెల్లినవే. ఈ బస్సుల కండిషన్ ఏ మాత్రం బాగుండదు, తరచూ బ్రేక్‌డౌన్స్‌కు గురవుతున్నాయి. బస్సుల పరిస్థితి ఇలా ఉంటే డ్రైవర్లలో నైపుణ్యం సైతం కొరవడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వివిధ డిపోల పరిధిలో సుమారు 10 వేల మందికిపైగా డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో, విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తతను పాటించే మొదటి తరం డ్రైవర్లు మినహా ఇటీవల కాలంలో నియమించిన చాలామందిలో డ్రైవింగ్ నైపుణ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పనిఒత్తిడి, ట్రాఫిక్ రద్దీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం వంటి ప్రతికూల అంశాలతో పాటు, నిర్లక్ష్యం కూడా డ్రైవర్ల విధి నిర్వహణను ప్రభావితం చేస్తోంది. గతేడాది మాదాపూర్‌లోని ఒక బస్టాపులో నిల్చున్న ఇద్దరు ఆటోడ్రైవర్లు, మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను సిటీ బస్సు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇలా తరచూ ఎక్కడో ఒక చోట బస్సులు ప్రమాదాలకు పాల్పడుతున్నాయి. సరైన నిఘా, నియంత్రణ లేకపోవడంతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సులు నడపడం సాధారణంగా మారింది. మరోవైపు చాలా చోట్ల ఆర్టీసీ డ్రైవర్లు లైన్ నిబంధనలు పాటించకుండా దూసుకొస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు, ఇతర వాహనాలకు అవకాశం ఇవ్వకుండా పరుగులు తీస్తున్నారు. బస్టాపుల్లో బస్సులు నిలపకుండా, రోడ్డు మధ్యలోనే నిలిపివేయడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించడం వంటి అంశాలను కూడా ఆర్టీఏ తీవ్రంగా పరిగణిస్తోంది. శిక్షలు కఠినం.. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు పాల్పడే ఆర్టీసీ డ్రైవర్లపై ఒక వైపు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మరోవైపు వారు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ అభిప్రాయపడ్డారు. సిటీ బస్సుల వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు, పాదచారులు మృత్యువాత పడితే 6 నెలలు, గాయాలపాలైతే 3 నెలల పాటు డ్రైవర్ల లైసెన్సు రద్దు చేస్తామన్నారు. ప్రమాద తీవ్రతననుసరించి కఠిన చర్యలు విధించనున్నట్లు చెప్పారు. -
నగరంలో ఐదు స్కూల్ బస్సులు సీజ్
హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనస్థలిపురంలో నిర్వహించిన తనిఖీల్లో నాలుగు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజు చేశారు. అలాగే మేడిపల్లిలో ఫిట్నెస్ లేని ఓ స్కూల్ బస్సును కూడా అధికారులు సీజ్ చేశారు. నగరంలో స్కూళ్లు బస్సులు సరైన ఫిట్ నెస్ లేవని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నారు.