చార్జీలు తగ్గించకపోతే 26న డిపోల ముందు ధర్నా
ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ఇక్కడ డీజిల్ ధరలు తగ్గుతున్నా కూడా ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలను దోచుకోవాలనే దృక్పథంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, 25వ తేదీ అర్ధరాత్రిలోగా ఆ నిర్ణయం వెలువడకపోతే, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఆర్టీసీ చార్జీలను పెంచబోమని తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిందని, ఇప్పుడు మాత్రం సంస్థకు నష్టాలు వస్తున్నాయన్న సాకు చూపించి చార్జీలు పెంచుతున్నారని ఆయన అన్నారు. ఆర్టీసీని నడిపించే సామర్థ్యం ప్రభుత్వానికి లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాలకు విచ్చలవిడిగా సహకరిస్తున్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం వల్ల ప్రైవేటు బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటే వాటివైపే ప్రయాణికులు మొగ్గు చూపుతారని ఆయన తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలన్నీ చంద్రబాబుకు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు బినామీ సంస్థలేనని, అందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.