ఆర్టీసీ టికెట్ బాదుడు!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సంస్థపై పడే భారాన్ని పూడ్చుకునేందుకు బస్సు చార్జీల పెంపుపై యాజమాన్యం దృష్టిసారించింది. చార్జీల రూపంలో ప్రజలపై భారం స్వల్పంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో టికెట్ ధరల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న విషయం స్పష్టమైంది. అయితే చార్జీల పెంపుపై ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేనప్పటికీ శుక్రవారం డీజిల్ ధరలు భారీగా పెరగడంతో చార్జీల పెంపుపై అధికారులు దృష్టిసారించారు.
లీటర్ డీజిల్‌పై రూ. 2.70 పైగా పెరగడంతో టీఎస్ఆర్టీసీపై ఏటా రూ.75 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా ఫిట్మెంట్ భారం ఉండడడం దానికి తోడు డీజిల్ ధరలు పెరగడంతో టికెట్ ధరల పెంపు అనివార్యం కానుంది. ఇప్పటికే 15 శాతం మేర చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని అమలు చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.